‘రామప్ప’పై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది

‘రామప్ప’పై నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది

హైదరాబాద్: కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వ కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రామప్పను అంచనాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని సూచించింది. రామప్ప చారిత్రక సంపద  సంరక్షణపై విచారణ సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. రామప్ప ఆలయ సంపద సంరక్షణ మీద పత్రికల్లో వచ్చిన కథనాలను కోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ హిమా కోహ్లీ,  విజయసేన్ రెడ్డిల ధర్మాసనం విచారణ జరిపింది. యునెస్కో విధించిన గడువు డిసెంబరు నెలాఖరులోగా సమగ్ర సంరక్షణ కార్యక్రమం చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ, కలెక్టర్‌‌తో కమిటీ ఏర్పాటు చేయాలని.. ఆగస్టు 4న కమిటీ తొలి సమావేశం నిర్వహించాలని పేర్కొంది.  విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.

‘రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం, ప్రపంచ పటంలో రామప్పకు స్థానం లభించడం తెలంగాణకు గర్వకారణం. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను తీర్చిదిద్దాలి. ఇది కచ్చితంగా గొప్ప అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా మారుతుంది. రామప్ప కట్టడం చారిత్రాత్మకంగా అత్యంత విలువైనది. యునెస్కో విధించిన గడువులోగా కార్యాచరణ చేపట్టి శాశ్వత గుర్తింపు దక్కించుకోవాలి. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దేశమంతా నిందిస్తుంది. రామప్ప అభివృద్ధి అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తాం. కాలపరిమితులు విధించుకొని పని చేయండి’ అని హైకోర్టు సూచించింది.  క్షేత్రస్థాయిలో సంయుక్త పరిశీలన జరపాలని.. నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది.