ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకు మన ఊరు – మన చరిత్ర

ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకు మన ఊరు – మన చరిత్ర

హైదరాబాద్, వెలుగు: డిగ్రీ విద్యార్థులకు ప్రతి ఊరి చరిత్రను రాయడాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ సాహిత్య అకాడమీ సిఫార్సు మేరకు..‘మన చరిత్రను మనమే రాసుకుందాం’ నినాదంతో  డిగ్రీ స్టూడెంట్లతో గ్రామ కైఫియత్తును రికార్డు చేయాలని ఈ మధ్యే నిర్ణయించింది. ఆర్ట్స్, హ్యూమానిటీస్, కామర్స్, లాంగ్వేజెస్ కోర్సులు చదువుతున్న డిగ్రీ ఫైనల్ ఇయర్  స్టూడెంట్లకు ప్రాజెక్టు వర్క్​గా ఈ టాస్క్ అప్పగించనున్నారు. ఇందుకు స్టూడెంట్లకు క్రెడిట్స్ ఇవ్వనున్నారు. 

41 అంశాలపై ప్రశ్నలు..

మన ఊరు – మన చరిత్ర కార్యక్రమంలో భాగంగా ఊరి చరిత్రను రాయబోయే స్టూడెంట్ల కోసం ఉన్నత విద్యాశాఖ ఓ క్వశ్చనీర్ ను రూపొందించింది. ఇందులో గ్రామ ఏర్పాటు నుంచి మొదలు ఆలయాలు, శాసనాలు, ప్రాచీన కట్టడాలు, గుట్టలు, జీవన ప్రమాణాల గురించిన ప్రశ్నలు ఉన్నాయి. వాగులు, పంటలు, వృత్తులు, పశువుల గురించిన ఎన్నో అంశాలను విద్యార్థులు సేకరించాల్సి ఉంటుంది. కరెంటు లేనప్పటి పరిస్థితులు, ఆటలు, జానపద పాటలు, గ్రామానికి చెందిన కవులు, అక్షరాస్యత, తెలంగాణ ఉద్యమం- పునర్నిర్మాణం, గ్రామంలో వచ్చిన మార్పులను ఊరి చరిత్రలో నమోదు చేయాల్సి ఉంటుంది.