V6 News

దంచికొడుతున్నఎండలు..దేశంలో రామగుండమే టాప్​

దంచికొడుతున్నఎండలు..దేశంలో రామగుండమే టాప్​

మే వచ్చిందంటే చాలు ఇండియా వేడి అంచుకు చేరిపోతుంది. మధ్యలోకి రాగానే అది తీవ్రమవుతుంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిసే అవకాశం ఉంది. దీంతో వేడి మరింత పెరుగుతోంది. దక్కన్​ పీఠభూమిపై ఉన్న తెలంగాణ, విదర్భల్లోనే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. హిమాలయ అంచుల్లోని రాష్ట్రాలు, కేరళ మినహా దేశం మొత్తం తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని రామగుండంలో అధికారికంగా ఇప్పటికే అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. జగిత్యాల జిల్లాలోని కొల్వాయిలో 47.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, అది అధికారిక లెక్క కాదు. దీంతో రామగుండమే అధికారిక లెక్కల్లో చేరింది.

హైదరాబాద్​లో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత రికార్డ్​ అయింది. ఈ వారం చివర్లో అది 44 డిగ్రీలను తాకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ వంటి 16 రాష్ట్రాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందంటున్నారు. రాజస్థాన్​లో అయితే 45 దాటుతుందని చెబుతున్నారు. ఇటు విదర్భ, మరఠ్వాడా, మధ్య మహారాష్ట్రల్లోనూ ఉష్ణోగ్రతలు సెగలు కక్కుతున్నాయి. ఈ రీజియన్​లోని నాగ్​పూర్​లో ఎక్కువగా 46.5 డిగ్రీలు నమోదైంది.

సాధారణ ఉష్ణోగ్రత కన్నా 3.1 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే చాన్సులున్నాయి. అయితే, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో రాబోయే మూడు రోజుల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవుతుందని చెబుతున్నారు. గత నెలలో ప్రపంచంలోని టాప్‌ వేడి నగరాల జాబితాల్లో ఇండియావే 15 ఉన్నాయి.