నవంబర్ దాకా ఫుల్​ వర్షాలు..ఈ సారి చలి కూడా ఎక్కువే

నవంబర్ దాకా ఫుల్​ వర్షాలు..ఈ సారి చలి కూడా ఎక్కువే

హైదరాబాద్‌, వెలుగు: ఈసారి వానలు దంచికొట్టాయి. గత కొన్నేండ్లలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షాలు కురిశాయి. వర్షాకాలం సీజన్ ముగిసినప్పటికీ ఇంకా వానలు పడుతూనే ఉన్నాయి. నవంబర్ దాకా ఇట్లనే వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత నుంచే మస్తు చలి ఉంటుందని చెప్పారు. మంచు ఎక్కువగా కురుస్తుందని పేర్కొన్నారు. ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడడంతోనే భారీ వర్షాలు కురిశాయి. జూన్‌ నుంచి సెప్టెంబర్ వరకు 9 అల్పపీడనాలు ఏర్పడగా, అవన్నీ బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయి. వాటి ప్రభావంతో ఆ సమయాల్లో పెద్ద వానలు పడ్డాయి. గత ఐదేండ్ల కాలంలో ఇంత ఎక్కువ అల్పపీడనాలు ఎప్పుడూ ఏర్పడలేదని అధికారులు తెలిపారు. ఈ నెలలోనూ రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని చెప్పారు. మరొకటి ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 అల్పపీడనాలు ఏర్పడగా, రెండు తుఫాన్లు వచ్చాయి. మేలో బంగాళాఖాతంలో అంఫాన్‌, జూన్‌లో అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్లు ఏర్పడ్డాయి.

వచ్చే నెల నుంచే ఎక్కువ చలి ఉంటది..

ఈ సీజన్‌లో సెప్టెంబర్‌ వరకు సాధారణం కంటే 50శాతం ఎక్కువగా వానలు పడ్డాయి. పోయిన నెలలో సాధారణం కంటే 94 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా 82 రోజులు వానలు పడగా, 1988 నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద స్థాయిలో వర్షాలు పడలేదు. వర్షాకాలం ముగిసినప్పటికీ ఇంకా వానలు కొడుతూనే ఉన్నాయి. రెండ్రోజుల కింద హైదరాబాద్ లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవంబర్ నెల మొదలవ్వగానే వర్షాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. ఆ వెంటనే విపరీతమైన చలి మొదలవుతుందని అంచనా వేశారు. సాధారణంగా నవంబర్‌లో అప్పుడప్పుడే చలి స్టార్ట్‌ అవుతుంటుంది. కానీ ఈసారి చలి ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మంచు ఎక్కువ కురుస్తుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఇన్‌చార్జి నాగరత్న తెలిపారు.