గరీబ్ కల్యాణ్ యోజన పథకంతో పేదరికం కంట్రోలైంది

గరీబ్ కల్యాణ్  యోజన పథకంతో పేదరికం కంట్రోలైంది

న్యూఢిల్లీ: కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ఎంతో మంది పేదల ఆకలి తీర్చిందని, దేశంలో పేదరికం పెరగకుండా కంట్రోల్ చేసిందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) మెచ్చుకుంది. కరోనా కాలంలో మన దేశంలో పేదరిక స్థాయిని అంచనా వేస్తూ ‘కరోనా, పేదరికం, అసమానత: ఎవిడెన్స్ ఫ్రమ్ ఇండియా’ పేరిట ఐఎంఎఫ్ బుధవారం ఒక రిపోర్టును విడుదల చేసింది. 2019లో దేశంలో పేదరికం 1 శాతం కంటే తక్కువగా ఉందని, 2020లో కూడా అంతేస్థాయిలో ఉన్నట్లు తెలిపింది. కరోనా టైంలో ఇండియాలో పేదరికం తీవ్ర స్థాయిలో పెరగకుండా అడ్డుకోవడంలో అన్న యోజన పథకం కీలకంగా పని చేసిందని వెల్లడించింది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొంది. కాగా, 2020 మార్చిలో కేంద్రం ఈ స్కీంను తెచ్చింది. స్కీం కింద ప్రతినెలా ఒక్కో వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తోంది. ఇటీవల ఈ స్కీంను కేంద్రం మరో ఆరునెలలు పొడిగించింది.