నీట మునిగిన గ్రామాలు, పంట పొలాలు 

 నీట మునిగిన గ్రామాలు, పంట పొలాలు 

 ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర, తెలంగాణను కలుపుతూ గోదావరి నదిపై అంతరాష్ట్ర  బ్రిడ్జిని నిర్మించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు..ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో అంతరాష్ట్ర బ్రిడ్జి దగ్గరలోని అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రకు రాకపోకలు బంద్ అయ్యాయి. మహారాష్ట్రలోని పలు గ్రామాలు, వందలాది ఎకరాల్లోని పంట పొలాలు నీటమునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఒకవైపు వర్షాలు, మరోవైపు వరదలు గ్రామాలను చుట్టేయడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గోదావరి నది వరద తగ్గే వరకు తమకు  కష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.