- భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి ఘటన
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం రేపింది. గురువారం ఘటన జరగ్గా బయటకు పొక్కలేదు. అతని భార్య ఫిర్యాదుతో కిడ్నాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్ తమకు ఫేక్ డాక్యుమెంట్లను చూపించి డబ్బులు వసూలు చేశాడని ఆరోపిస్తూ, ఇటీవల కొందరు భూ బాధితులు రామకృష్ణాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే గురువారం మధ్యాహ్నం బెల్లంపల్లికి గుర్తు తెలియని వెహికల్ లో కొందరు వచ్చి గోమాస శ్రీనివాస్ ను కిడ్నాప్ చేశారు. సాయంత్రం వరకు అతను ఇంటికి రాకపోవడంతో అనుమానించిన అతని భార్య అమృత బెల్లంపల్లి తాళ్ల గురిజాల పీఎస్ లో కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్తెలిపారు. కిడ్నాప్ ఘటనపై అనుమానాలు వస్తున్నాయి. అతనిపై ఫిర్యాదు చేసిన భూ బాధితులకు డబ్బులు చెల్లించకుండా ఉండేందుకు శ్రీనివాస్ కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడా..? లేదంటే నకిలీ భూమి పత్రాలు చూపి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
