V6 News

ఐక్యంగా పోరాడుదాం.. ఆర్టీసీ కార్మికులకు జేఏసీ నేతల పిలుపు

ఐక్యంగా పోరాడుదాం.. ఆర్టీసీ కార్మికులకు జేఏసీ నేతల పిలుపు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర సర్కారు నిండా ముంచుతోందని, ఎన్నో సమస్యలు పెండింగ్​లో ఉన్నాయని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్ హనుమంతు ముదిరాజ్​ అన్నారు. పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని, అందుకు కార్మికులంతా సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు డిపోల్లో భరోసా యాత్ర పేరుతో కార్మికులను కలిసిన జేఏసీ నేతలు శుక్రవారం ఎంజీబీఎస్, సీబీఎస్ లో వివిధ జిల్లాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను కలిసి మాట్లాడారు. 

సమస్యలు పరిష్కారం కావట్లేదని, పీఆర్సీలు..డీఏలు ఇవ్వట్లేదని, పోరాటాలు చేయాల్సిందేనని వారితో చెప్పారు. అందుకు తాము రెడీగా ఉన్నామని కార్మికులు చెప్పినట్లు నేతలు మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీలో యూనియన్లు లేకపోవటంతో కార్మికులపై అధికారుల వేధింపులు పెరిగాయని, అవి తట్టుకోలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. జేఏసీ నేతలు నరేందర్, కమాల్ రెడ్డి, అబ్రహంతో పాటు పలువురు పాల్గొన్నారు.

రౌండ్ టేబుల్ మీటింగ్​కు రండి

ఆర్టీసీ పరిస్థితి, కార్మికుల సమస్యలపై ఈనెల 16న నిర్వహించే రౌండ్ టేబుల్ మీటింగ్ కు రావాలని పార్టీల నేతలను జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ చీఫ్​ కోదండరాం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి పోటు రంగారావును కలిసి ఇన్విటేషన్​ అందజేశారు.