55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. టికెట్లు దక్కని నేతల ఆందోళనలు

55 మందితో  కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్.. టికెట్లు దక్కని నేతల ఆందోళనలు
  • 12 బీసీలకు, మూడు ముస్లింలకు.. 
  • 12 మంది ఎస్సీలకు, ఇద్దరు ఎస్టీలకు, 
  • ఇద్దరు బ్రాహ్మణులకు అవకాశం
  • పాలేరు సీటు హోల్డ్‌‌లో.. కొందరు ప్రముఖుల స్థానాలూ సెకండ్ లిస్ట్‌‌లోనే
  • మేడ్చల్, ఉప్పల్, కొల్లాపూర్, గద్వాల టికెట్లు దక్కని నేతల ఆందోళనలు
  • బహదూర్​పుర, చాంద్రాయణగుట్ట ముస్లిం నేతల నిరసనలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఫస్ట్ లిస్టును కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. తొలి విడత జాబితాలో భాగంగా 55 మంది పేర్లను ప్రకటించింది. వివాదం ఉన్న నియోజకవర్గాలను వదిలేసి.. స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలకు అభ్యర్థుల లిస్టును ఆదివారం విడుదల చేసింది. లిస్టులో 17 మంది రెడ్లు, 12 మంది ఎస్సీలు, 12 మంది బీసీలు, ఏడుగురు వెలమలు, ముగ్గురు ముస్లింలు, ఇద్దరు బ్రాహ్మణులు, ఇద్దరు ఎస్టీలకు అవకాశం కల్పించారు. ఫస్ట్ లిస్టులో ప్రకటించిన దాదాపు సగం స్థానాలను (26 సీట్లు) అగ్ర కులస్తులకు కేటాయించారు. మరోవైపు ఓల్డ్ సిటీలోని గోషామహల్, చాంద్రాయణగుట్ట, యాకుత్​పుర, బహదూర్​పుర స్థానాలను బీసీలకు కేటాయించడం గమనార్హం. 

ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినోళ్లలో పది మందికి లిస్టులో స్థానం కల్పించారు. ఫ్యామిలీల్లో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఉత్తమ్, ఆయన భార్య పద్మావతికి.. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావుకు చాన్స్ దక్కింది. మొత్తంగా ఆరుగురు మహిళా అభ్యర్థులకు టికెట్ కన్ఫామ్ చేశారు.

కొన్ని సీట్లు హోల్డ్‌‌‌‌‌‌‌‌లో

కమ్యూనిస్టులతో పొత్తుపై చర్చలు, ట్రయాంగిల్ పోరు ఉండడంతో పాలేరు సీటు ను కాంగ్రెస్ అధిష్ఠానం హోల్డ్​లో పెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే పాలేరు సీటును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు  కోరుతున్నారు. వారికి తోడు కమ్యూనిస్టులు (సీపీఎం) కూడా పాలేరు కావాలని అడుగుతుండడంతో దానిపై క్లారి టీ వచ్చాక రెండో జాబితాలో ప్రకటించనున్నారు. మధుయాష్కీ పోటీ చేయాలనుకుంటున్న ఎల్బీ నగర్, పొన్నం ప్రభాకర్ బరిలో నిలవాలనుకున్న హుస్నాబాద్, షబ్బీర్ అలీ అప్లై చేసుకున్న కామా రెడ్డి స్థానాలకూ తొలి జాబితాలో చోటు దక్కలేదు. సీటు రా దన్న ఆవేదనతో పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడారు. జనగామ అభ్యర్థినీ తొలి లిస్టులో ప్రకటించలేదు. ప్రస్తుతం అక్కడి నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఓయూ విద్యార్థి నేత బాలలక్ష్మి మధ్య పోటీ ఉన్నట్టు తెలిసింది.

అసంతృప్తుల ఆగ్రహ జ్వాలలు 

కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో చోటు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్బుకు టికెట్లను అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీభవన్ ముందు పలువురు నేతలు నిరసనలకు దిగారు.  కొందరు నేతలు అక్కడి కొన్ని రూములకు తాళాలు వేసుకుని వెళ్లారు. మేడ్చల్ టికెట్‌‌‌‌‌‌‌‌ను ఆశించిన వారిలో హరివర్ధన్ రెడ్డి ఒకరు. అయితే టికెట్‌‌‌‌‌‌‌‌ను తోటకూర వజ్రేశ్ యాదవ్‌‌‌‌‌‌‌‌కు కేటాయించడంతో.. హరివర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి పార్టీలో ఉన్నానని, కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చెప్పారు. హరివర్ధన్ రెడ్డి ఇంటికి వజ్రేశ్ యాదవ్ వెళ్లగా.. హరివర్ధన్ కుటుంబ సభ్యులు, అనుచరులు అడ్డుకున్నారు. ఉప్పల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన రాగిడి లక్ష్మారెడ్డి.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలోకి ఐదేండ్ల కిందటే వచ్చిన రేవంత్.. పార్టీలోని సీనియర్లను పక్కన పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలంటే రేవంత్‌‌‌‌‌‌‌‌కు కోపమా అని ప్రశ్నించారు. కొల్లాపూర్ టికెట్‌‌‌‌‌‌‌‌ను జూపల్లి కృష్ణారావుకు కేటాయించడంతో.. అక్కడి నుంచి పోటీ చేయాలని భావించిన చింతలపల్లి జగదీశ్వర్ రావు అనుచరులు జిల్లా పార్టీ కార్యాలయంలో రచ్చ చేశారు. పార్టీ ఫ్లెక్సీలు, వాల్​పేపర్లను చించేశారు. గద్వాల టికెట్‌‌‌‌‌‌‌‌ను సరిత తిరుపతయ్యకు కేటాయించడంతో.. ఆ టికెట్​ను ఆశించిన కురువ విజయ్ అనుచరులు గాంధీభవన్ మెట్ల ముందు ఆందోళనకు దిగారు. పాతబస్తీకి చెందిన ముస్లిం లీడర్లూ గాంధీభవన్​లో నిరసన చేపట్టారు. చాంద్రాయణగుట్ట, బహదూర్​పుర నియోజకవర్గానికి చెందిన ముస్లిం కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓల్డ్​ సిటీలో ముస్లింలను కాదని బీసీలకు టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు.

వీలైనంత త్వరగా సెకండ్ లిస్ట్

అభ్యర్థుల రెండో జాబితాను కూడా త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు తెలిసింది. 18న రెండో జాబితాను ప్రకటించాలని భావిస్తున్నా.. అప్పుడు రాహుల్ గాంధీ టూర్ ఉండడంతో అంతకన్నా ముందే ప్రకటించాలని ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారని సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లోనే మిగతా లిస్టు కూడా వచ్చే అవకాశం ఉందని పార్టీవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ లోపు కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు కూడా కొలిక్కి వస్తాయని నేతలు భావిస్తున్నారు. పూర్తి లిస్ట్ వచ్చాక బస్సు యాత్రను షురూ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేసినట్లు సమాచారం.