హమ్మయ్య.. చిరుత చిక్కింది.. కుక్క కోసం వచ్చింది.. బోనులో పడింది..!

హమ్మయ్య.. చిరుత చిక్కింది.. కుక్క కోసం వచ్చింది.. బోనులో పడింది..!

మద్దూరు, వెలుగు: నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపల్ పరిధి రెనివట్ల గ్రామ శివారు పిల్లి గుండు గుట్ట సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. గత వారం ఈ ప్రాంతంలో మూడు చిరుతలు సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ మంగళవారం బోను ఏర్పాటు చేసి, అందులో కుక్కను వదిలి సీసీ కెమెరాలు అమర్చారు.

కుక్కను చూసిన చిరుత అదే రోజు రాత్రి బోనులోకి వచ్చి చిక్కినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను అదుపులోకి తీసుకున్నారు. చిరుతను నాగర్​కర్నూలు జిల్లా మన్ననూరు మద్దిమడుగు అడవుల్లో వదిలిపెట్టనున్నట్లు వెల్లడించారు.

ఇంకా చిరుతలు ఉండే అవకాశం ఉన్నందున, సమీపంలోని పెద్ద చెరువుకు నీటి కోసం వచ్చే సమయంలో రైతులు గుంపులుగా వెళ్లాలని, టార్చ్ లైట్ లేదా శబ్ధం చేస్తూ పొలాలకు వెళ్లాలని అటవీ అధికారులు సూచించారు.