తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరగనున్న గ్రూప్‌‌ –1 నియామకాలు

తెలంగాణ  ఏర్పాటు తర్వాత తొలిసారి జరగనున్న గ్రూప్‌‌ –1 నియామకాలు

 

  • సింగిల్‌‌ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజన్‌‌ బెంచ్​ స్టే
  • అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదు
  • మాల్​ప్రాక్టీస్, పేపర్​ లీక్ ​జరిగినట్టు ఆధారాల్లేవని వెల్లడి
  • ఇందులో పక్షపాతం ఎక్కడ ఉన్నదని ప్రశ్న
  • నియామకాలకు  ధర్మాసనం అనుమతి.. తుది తీర్పునకు లోబడి ఉండాలని కండీషన్‌‌
  • తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరగనున్న గ్రూప్‌‌ –1 నియామకాలు
  • ఆ వెంటనే గ్రూప్2, గ్రూప్​3 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​–1 పోస్టుల భర్తీకి ఎట్టకేలకు లైన్​ క్లియర్​అయింది. మెయిన్స్​జవాబు పత్రాలను రీవాల్యూయేషన్​చేయాలని, లేదంటే తిరిగి మెయిన్స్‌‌ పరీక్షలు నిర్వహించాలని గత నెల 9న సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును బుధవారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిలిపివేసింది. ఇప్పటికే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌ జరిగిందని, నియామకాలకు అనుమతించాలని ప్రభుత్వం చేసిన ప్రత్యేక అభ్యర్థనను  ఆమోదించింది. నియామకాలు మాత్రం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం. మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో గ్రూప్–​1 సర్టిఫికెట్​వెరిఫికేషన్‌‌కు ఎంపికైన అభ్యర్థులకు కొండంత ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి గ్రూప్‌‌ –1 పోస్టులు భర్తీ కానుండగా, ఆ వెంటనే గ్రూప్​–2, గ్రూప్–​3 నియామకాలు చేపట్టే అవకాశముండడంతో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, 563 పోస్టుల భర్తీ కోసం 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయగా, అదే ఏడాది జూన్ 9న ప్రిలిమ్స్,అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

సింగిల్​ బెంచ్​ తీర్పును తప్పుపట్టిన డివిజన్‌‌ బెంచ్

విచారణ సందర్భంగా సింగిల్‌‌ జడ్జి తీర్పులోని పలు అంశాలపై డివిజన్​బెంచ్​ప్రశ్నలు వేసింది.‘‘గ్రూప్‌‌ –1 పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించలేదు. సమగ్రతను పాటించలేదు. మూల్యాంకనంలో తప్పులు జరిగాయి’’ అని సింగిల్‌‌ జడ్జి తేల్చడాన్ని  తప్పుపట్టింది. అభ్యర్థులు 10 నుంచి 12 గంటలు చదివారని జడ్జి ఎలా చెబుతారని ప్రశ్నించింది. అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదని పేర్కొన్నది. పరీక్షల్లో మాస్‌‌ కాపీయింగ్, మాల్‌‌ప్రాక్టీస్‌‌ లేదంటే పేపర్‌‌ లీకేజీల్లాంటివి జరిగితేనే కోర్టుల జోక్యానికి వీలుంటుందని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. ‘‘పేపర్‌‌ లీకేజీ అయితే పరీక్షలు రద్దు చేయవచ్చు. కానీ ఇక్కడ అలాంటిదేదీ జరగలేదు. ఈ విషయాన్ని సింగిల్‌‌ జడ్జి గుర్తించలేదు. కనీసం పక్షపాతం చూపినట్లు  తేల్చలేదు. ఫలానా అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని రుజువులు లేవు. 

 పరీక్షా కేంద్రాల సంఖ్య 45 నుంచి 46కు పెరిగాయని చెప్పడం అక్రమాల కిందికి రాదు. 2 సెంటర్లలో మహిళా అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పాసయ్యారని చెప్పి పరీక్షలను రద్దు చేయడానికి వీల్లేదు. అలా జరిగినచోట్ల అక్రమాలు జరిగాయని తేల్చలేదు. అలాగే, తెలుగులో పరీక్ష రాసిన వాళ్లు ఎక్కువగా అర్హత సాధించలేదని చెప్పి తప్పు జరిగిందంటే ఎలా?’’  అని  ప్రశ్నించింది. వీటిపై ఇరుపక్షాల వాదనల తర్వాత తగిన ఉత్తర్వులను జారీ చేస్తామని ప్రకటించింది. పరీక్షల నిర్వహణలో దుర్వినియోగం, పరీక్ష పేపర్ల లీకేజీ, మాస్‌‌ కాపీయింగ్‌‌.. ఇలాంటి తీవ్రమైన అభియోగాలు, వాటికి ఆధారాలు ఉన్నప్పుడు తప్ప ఉద్యోగ నియామక ప్రక్రియలో కోర్టుల జోక్యానికి ఆస్కారం లేదని సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయని డివిజన్‌‌ బెంచ్​ తేల్చి చెప్పింది. ‘‘గ్రూప్‌‌–1 మెయిన్స్‌‌ పరీక్షల నిర్వహణ వ్యవహారంలో అభ్యర్థులకు రెండు హాల్‌‌టికెట్లు జారీ చేశారు, పరీక్షా కేంద్రాలు పెరిగాయి, రెండు సెంటర్స్‌‌ పూర్తిగా మహిళా అభ్యర్థులకు కేటాయించారు’’ లాంటి అంశాలపై అనుమానాలను పిటిషనర్లు సింగిల్‌‌ జడ్జి వద్ద లేవనెత్తారని చెప్పింది. వాటిపై సింగిల్‌‌ జడ్జి వెలువరించిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు వెలువరిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

ఊహాజనిత ఆరోపణలే..

కమిషన్‌‌కు నిబద్ధత లేదన్న సింగిల్​జడ్జి వ్యాఖ్యలపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గ్రూప్‌‌– 1 పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించలేదని, సమగ్రత పాటించలేదని, మూల్యాంకనంలో తప్పులు జరిగాయని సింగిల్‌‌ జడ్జి తేల్చడాన్ని డివిజన్​ బెంచ్‌‌ ప్రాథమికంగా తప్పుపట్టింది. అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదని పేర్కొన్నది.  ఎక్కడ అన్యాయం జరిగిందో, ఎక్కడ అభ్యర్థికి నష్టం వాటిల్లిందో తీర్పులో ఎక్కడా ఆధారాలు చూపలేదని తెలిపింది. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పనపై కమిషన్‌‌ నిర్ణయం తీసుకుంటుందని, ఇదేమీ నిబంధనల ఉల్లంఘన కిందికో, అభ్యర్థులకు నష్టం చేకూర్చేదో కాదని చెప్పింది. పరీక్షా కేంద్రాల్లో పేపర్లను సీల్డ్‌‌ కవర్‌‌లో తెరుస్తారని గుర్తు చేసింది. ఒక సెంటర్‌‌లో ఎక్కువ, మరో సెంటర్‌‌లో తక్కువ అభ్యర్థులు పరీక్ష రాయడానికి అక్కడున్న వసతులే కారణమని చెప్పింది. 21 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యేటప్పుడు పాలనాపారమైన సౌలభ్యం కోసమే రెండో హాల్‌‌ టికెట్‌‌ ఇవ్వొచ్చునని ధర్మాసనం అభిప్రాయపడింది.  ఊహాజనిత ఆరోపణలతో పలువురు అభ్యర్థులు సింగిల్‌‌ జడ్జి వద్ద పిటిషన్లు వేశారని వ్యాఖ్యానించింది. ఆన్సర్‌‌‌‌ షీట్స్‌‌ను పరిశీలించకుండా ఫలానా అభ్యర్థికి నష్టం జరిగిందనే నిర్ణయానికి సింగిల్‌‌జడ్జి ఎలా వచ్చారనే సందేహాన్ని లేవనెత్తింది. సరిగ్గా మూల్యాంకనం చేయలేదని ఎలా నిర్ణయానికి వచ్చారని కూడా ప్రశ్నించింది. తాను రాసిన ప్రశ్నలకు మార్కులు వేయలేదని అభ్యర్థినుంచి ఏదైనా ఫిర్యాదు అందిందా? అనే సందేహాన్ని లేవనెత్తింది. మూడు భాషల్లోని సబ్జెక్టులు, ప్రశ్నలు ఒకటే అయినప్పుడు మోడరేషన్‌‌ పద్ధతి అనే ప్రశ్న ఎలా సాధ్యమని నిలదీసింది.

చట్ట ప్రకారం మూల్యాంకనం జరగలే: పిటిషనర్ల తరఫు లాయర్లు

గ్రూప్‌‌–1 పరీక్షలను సవాల్‌‌ చేసిన అభ్యర్థుల తరఫున సీనియర్‌‌ న్యాయవాదులు జి. విద్యాసాగర్, సురేందర్‌‌రావు, రచనారెడ్డి ఇతరులు వాదనలు వినిపించారు.  గ్రూప్‌‌–1 పరీక్షల నిర్వహణలో కమిషన్‌‌ సొంత రూల్స్‌‌నే అమలు చేయలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌‌లో 3 మూల్యాంకనాలు ఉంటాయని, రెండు హాల్‌‌ టిక్కెట్లు ఇస్తామని లేదన్నారు. వెబ్‌‌సైట్‌‌లో ఏ సమాచారం ఇవ్వలేదని, పేపర్‌‌ ప్రకటనలే ఇచ్చారని చెప్పారు. చట్ట ప్రకారం  మూల్యాంకనం జరగలేదని వాదించారు. కేవలం మార్కులు మాత్రమే వేశారని చెప్పారు. రూల్స్‌‌కు విరుద్ధంగా మూల్యాంకనం జరిగిందన్నారు. వీటన్నింటినీ సింగిల్‌‌ జడ్జి పరిగణనలోకి తీసుకునే తీర్పు చెప్పారని తెలిపారు. టీజీపీఎస్సీ సీల్డ్‌‌ కవర్‌‌లో ఇచ్చిన వివరాలను పరిశీలించాకే తీర్పు చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి తుది మార్కుల జాబితాను, జనరల్‌‌ ర్యాంకుల లిస్ట్‌‌ను రద్దు చేస్తూ వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోరాదన్నారు. మోడరేషన్‌‌ పద్ధతిలో తిరిగి మూల్యాంకనం చేయాలన్న ఉత్తర్వులు సబబేనని చెప్పారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యను ఒక్కోసారి ఒక్కో రకంగా టీజీపీఎస్సీ ప్రకటించిందని తెలిపారు.  అప్పీలులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులు ఆరోపణల ఆధారంగా ఇచ్చిన తీర్పు కాదని, అనేక అంశాలపై లోతుగా విచారణ చేపట్టాకే జడ్జిమెంట్ ఇచ్చారని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు, సింగిల్‌‌ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ బెంచ్​ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోగా.. దీనిపై  న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేసి, నియామకాలు చేపడితే ఎంతోమంది అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ  దశలో ఏజీ కల్పించుకొని, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సిన దశలో నియామకాలు ఆగాయాన్నరు. అప్పీళ్లపై  తుది తీర్పుకు లోబడి ఉంటే షరతుపై నియామకాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వాదనల తర్వాత సింగిల్​ జడ్జి తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం.. నియామకాలు తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉండాలని షరతు విధించింది. ఈలోగా అప్పీల్‌‌లో ఇరుపక్షాలు అక్టోబర్‌‌ 10నాటికి రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది.  విచారణను అక్టోబర్‌‌ 15కు వాయిదా వేసింది.

వాడీవేడిగా వాదోపవాదాలు..

తొలుత టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్​ జనరల్‌‌ సుదర్శన్‌‌రెడ్డి, సీనియర్‌‌ న్యాయవాది ఎస్‌‌.నిరంజన్‌‌రెడ్డి, అర్హత పొందిన అభ్యర్థుల తరఫున సీనియర్‌‌ న్యాయవాదులు దేశాయ్‌‌ ప్రకాశ్‌‌ రెడ్డి, కె.లక్ష్మీనరసింహ ఇతరులు వాదనలు వినిపించారు. పిటిషనర్లకు అన్యాయం జరిగిందని చెప్పేందుకు ఆధారాలు చూపలేదన్నారు. 2011లో చివరిసారి గ్రూప్‌‌–1 పరీక్ష జరిగిందని, 2022లో పరీక్ష నిర్వహించినప్పటికీ కోర్టు తీర్పుతో రద్దయ్యిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రూప్‌‌–1 పోస్టుల భర్తీ జరగలేదని తెలిపారు. అక్రమాలు జరిగాయని, ప్రొసీజర్​అమలు చేయలేదనేందుకు ఆధారాలు లేవన్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక, ఎంపికైన వారిలో మహిళలు, పురుషుల మధ్య తేడాలపై అనుమానాలతో పిటిషన్లు వేస్తే తీర్పు వచ్చిందన్నారు. రాజ్యాంగబద్ధమైన సర్వీస్‌‌ కమిషన్‌‌ నిబద్ధతగా లేదని, దురుద్దేశంతో వ్యవహరించిందని తేల్చడం అన్యాయమని పేర్కొన్నారు. చట్ట నిబంధనలు, నోటిఫికేషన్‌‌ రూల్స్‌‌కు వ్యతిరేకంగా జరిగినట్లు ఒక్క సంఘటనా లేదన్నారు. దివ్యాంగులకు ఇబ్బంది ఉండకూడదనే మరో సెంటర్‌‌ అదనంగా ఏర్పాటు చేయడం వల్ల పరీక్షా కేంద్రాల సంఖ్య 46కి చేరిందన్నారు. కోఠి మహిళా కాలేజీలో పురుషులకు టాయిలెట్స్‌‌ లేకపోవడం వల్ల అక్కడ పూర్తిగా మహిళలకు కేటాయింపు చేయడాన్ని కూడా సింగిల్‌‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదన్నారు.