
లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో రసవత్తరంగా సాగుతున్న ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్టు అనూహ్య మలుపులు తిరుగుతూ ఆఖరి రోజుకు చేరుకుంది. విజయం ఇరు జట్లనూ ఊరిస్తోంది. తొలి మూడు రోజులు సమంగా నిలిచిన పోరులో నాలుగో రోజు, ఆదివారం ఇరు జట్ల బౌలర్లు అదరగొట్టారు. తొలుత వాషింగ్టన్ సుందర్ (4/22) స్పిన్ మ్యాజిక్‌కు తోడు మహ్మద్ సిరాజ్ (2/31), జస్‌ప్రీత్ బుమ్రా (2/38) ఆకట్టుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 62.1 ఓవర్లలో 192 రన్స్‌కే ఆలౌటైంది. జో రూట్ (40), కెప్టెన్ బెన్ స్టోక్స్ (33) మాత్రమే కాస్త ప్రతిఘటించారు.
బౌలర్లు విజయానికి బాటలు వేసినా.. ఇండియా టాపార్డర్ తడబడింది. 193 టార్గెట్ ఛేజింగ్‌లో నాలుగో రోజు చివరకు 17.4 ఓవర్లలో 58/4తో నిలిచింది. కేఎల్ రాహుల్ (33 బ్యాటింగ్) ఇంగ్లిష్ బౌలర్లకు ఎదురు నిలిచినా.. యశస్వి జైస్వాల్ (0), కెప్టెన్ గిల్ (6), కరుణ్ నాయర్ (14) ఫెయిలయ్యారు. చేతిలో ఇంకో 6 వికెట్లు ఉండగా చివరి రోజు ఇండియాకు మరో 135 రన్స్ కావాలి. పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా మారిన పిచ్‌పై బ్యాటింగ్ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం మన బ్యాటర్లు జాగ్రత్తగా ఆడితేనే విజయం సాధ్యం అవుతుంది.
సిరాజ్ దెబ్బ
ఓవర్‌నైట్ స్కోరు 2/0తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఇండియా పేసర్లు ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా తొలి గంటలో మహ్మద్ సిరాజ్ పదునైన బాల్స్‌తో వణికించాడు. బాల్‌తో పాటు మాటలతోనూ వారిపై ఎదురుదాడికి దిగాడు. బుమ్రా పట్టిన సింపుల్ క్యాచ్‌తో ఓపెనర్ బెన్ డకెట్ (12) ను ఔట్ చేసి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన అతను తర్వాత లైన్ మార్చుకొని స్టంప్స్‌ను టార్గెట్ చేశాడు. ఫలితంగా ఒలీ పోప్ (4) ఎల్బీ రూపంలో రెండో వికెట్ సాధించాడు. తన తొలి స్పెల్‌లో హైదరాబాద్ పేసర్ ఏడు ఓవర్లలో 11 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
మరో ఎండ్‌లో అతనికి తోడుగా బౌలింగ్ చేసిన బుమ్రా.. జాక్ క్రాలీ (22) ని ఇబ్బంది పెట్టాడు. బౌలింగ్‌లో మార్పు చేసి బుమ్రా ప్లేస్‌లో నితీశ్‌కు బాల్ ఇచ్చిన గిల్ ఫలితం రాబట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన తెలుగు కుర్రాడు.. జాక్ క్రాలీని ఔట్ చేసి కెప్టెన్ నమ్మకం నిలబెట్టాడు. నితీశ్ బాల్‌ను డ్రైవ్ చేయబోయిన క్రాలీ ఇచ్చిన క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ అందుకోవడంతో ఆతిథ్య జట్టు 50 రన్స్‌కే మూడో వికెట్ కోల్పోయింది.
రెండు ఎండ్లలో బౌలర్లు విజృంభిస్తుండగా.. హ్యారీ బ్రూక్ (23) లాభం లేదని కౌంటర్ ఎటాక్‌కు దిగాడు. ఆకాశ్ బౌలింగ్‌లో రెండు ర్యాంప్ షాట్లతో పాటు మిడాఫ్ మీదుగా సిక్స్ కొట్టాడు. అయినా ఆకాశ్ స్టంప్స్‌ను టార్గెట్ చేయడం కొనసాగించాడు. ఈ క్రమంలో స్వీప్ షాట్‌కు ట్రై చేసిన బ్రూక్ లైన్ మిస్సవ్వడంతో మిడిల్ స్టంప్ ఎగిరిపడింది. దాంతో 87/4తో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.
సుందర్ మాయ
లంచ్ తర్వాత సీనియర్ బ్యాటర్ రూట్, కెప్టెన్ స్టోక్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పేసర్లతో పాటు స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కొంటూ ఐదో వికెట్‌కు 67 రన్స్ జోడించడంతో ఇంగ్లిష్ టీమ్ క్రమంగా పుంజుకుంది. ఈ దశలో పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్ సుందర్ వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టి ఆ టీమ్‌ను భారీ దెబ్బకొట్టాడు. సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్న రూట్‌ను అద్భుతమైన బాల్‌తో బౌల్డ్ చేశాడు.
ఆ వెంటనే ప్రమాదకర జేమీ స్మిత్ (8)ను కూడా సుందర్ బౌల్డ్ చేయగా.. 176/6తో ఇంగ్లండ్ టీ బ్రేక్‌కు వెళ్లింది. కెప్టెన్ స్టోక్స్ క్రీజులో కుదురుకోగా.. చేతిలో నాలుగు వికెట్లు ఉండటంతో ఇంగ్లండ్ 250 రన్స్ చేసేలా కనిపించింది. కానీ, ఆఖరి సెషన్లో బౌలర్లు మరింతగా విజృంభించారు.
బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన స్టోక్స్ బౌల్డ్ అవ్వగా.. వెంటనే బుమ్రా వేసిన పదునైన యార్కర్‌కు బ్రైడన్ కార్స్ (1)లెగ్ స్టంప్ పడిపోయింది. కాసేపు ప్రతిఘటించిన క్రిస్ వోక్స్ (10).. బుమ్రా బాల్‌ను వికెట్ల మీదకు ఆడుకొని ఔటయ్యాడు. షోయబ్ బషీర్ (2)ను లాస్ట్ వికెట్‌గా ఔట్ చేసిన సుందర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
మనోళ్లదీ తడబాటే..
ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేసిన ఆనందం ఇండియాకు ఎంతోసేపు నిలువలేదు. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో రెండో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జైస్వాల్‌ను ఆర్చర్ మరోసారి పెవిలియన్ చేర్చాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ ఐదో ఓవర్లో ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను క్రిస్ వోక్స్ డ్రాప్ చేశాడు. అప్పటికి 5 రన్స్ వద్ద ఉన్న రాహుల్ ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాతి రెండు బాల్స్‌ను బౌండ్రీకి తరలించాడు.
ఆర్చర్ ఓవర్లో కేఎల్, వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ చెరో ఫోర్ కొట్టారు. కానీ, బ్రైడన్ కార్స్ వరుస ఓవర్లలో ఇండియాకు డబుల్ షాక్ ఇచ్చాడు. కరుణ్, శుభ్‌మన్ గిల్ ఇద్దరినీ ఎల్బీ చేశాడు. గిల్ ఓ రివ్యూ కూడా వేస్ట్ చేశాడు. సెషన్ చివర్లో నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్‌దీప్ (1)ను స్టోక్స్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో
నాలుగో రోజును ఇంగ్లండే సంతృప్తిగా ముగించింది.