ఎక్సైజ్ ఆఫీసర్లు, బెల్లం వ్యాపారుల మధ్య వార్

ఎక్సైజ్ ఆఫీసర్లు, బెల్లం వ్యాపారుల మధ్య వార్
  •     నగరంలో విక్రయాలపై ఆంక్షలు
  •     అమ్మకాలపై తలోమాట చెప్తున్న ఎక్సైజ్ ఆఫీసర్లు
  •     ఇదే అదనుగా బెల్లం రేట్లు పెంచుతున్న లోకల్ వెండర్స్

హనుమకొండ, వెలుగు: నగరంలో ఎక్సైజ్ ఆఫీసర్లు, బెల్లం వ్యాపారుల మధ్య వార్ నడుస్తోంది. అమ్మకాల విషయంలో సాధారణ రూల్స్ తప్ప.. ఎలాంటి ఆంక్షలు లేవని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెబుతుండగా.. కిందిస్థాయి అధికారులు మాత్రం గుడుంబాను సాకుగా చూపి బెల్లం విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు కూడా నమోదు చేస్తున్నారు. దీంతో వరంగల్ బీట్ బజార్ లో బెల్లం కొరత ఏర్పడింది. మరోవైపు అయ్యప్ప దీక్షలు, సంక్రాంతి, మినీ మేడారం ఇలా వరుస పండుగలు ఉండగా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించి కొందరు వ్యాపారులు అధిక రేట్లకు బెల్లం అమ్ముతున్నారు.

ఇదీ పరిస్థితి..

వరంగల్ సిటీలోని బీట్ బజార్ ఏరియా నుంచే ఉమ్మడి జిల్లాకు బెల్లం సప్లై జరుగుతోంది. ఇక్కడి వ్యాపారులు ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, మహారాష్ట్ర, ఏపీలోని చిత్తూరు నుంచి టన్నుల కొద్దీ బెల్లం తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఇదిలా ఉంటే, కొద్దిరోజులుగా ఇక్కడి వ్యాపారులకు, ఎక్సైజ్​ఆఫీసర్లకు మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. గుడుంబా నియంత్రణ పేరుతో ఎక్సైజ్ ఆఫీసర్లు హోల్ సేల్ వ్యాపారులు 20కిలోలకు మించి అమ్మకూడదనే నిబంధన విధించారు. బెల్లం అమ్మిన ప్రతిసారి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. కొనేటోళ్ల అడ్రస్, ఆధార్​ కార్డు, ఫోన్ నెంబర్ కూడా తీసుకోవాలని చెప్పారు. దీనికి వ్యాపారులు ఓకే చెప్పారు. కానీ నిత్యం తనిఖీల పేరుతో వారిని వేధిస్తున్నారు. రోజూ ఒక వెహికల్ ను బీట్ బజార్​లోనే పెట్టి షాపుకొకరి చొప్పున సిబ్బందిని నియమించారు. దీంతో వ్యాపారులకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల ఓ బెల్లంలారీని సైతం సీజ్ చేశారు. దీనిపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నాలు చేశారు.

కోర్టు ఆదేశాలూ భేఖాతర్..

గత మూడు నెలలుగా వ్యాపారులు, ఎక్సైజ్ సిబ్బంది మధ్య ఈ గొడవ నడుస్తుండడంతో బెల్లం నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఇటీవల అయ్యప్ప స్వాముల దీక్షలకు అరవన్నం తయారీకి సైతం భక్తులు ఇబ్బందిపడ్డారు. రాబేయే సంక్రాంతి, మినీ మేడారం జాతరకు సైతం ఇక్కట్లు తప్పేలా లేవు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు, మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్​ కూ విన్నవించారు. కొద్దిరోజుల కింద కోర్టుకు సైతం వెళ్లగా..  రూల్స్​ప్రకారం తెల్ల బెల్లం వ్యాపారం చేసుకుంటుంటే అడ్డుచెప్పొద్దని, ఒకవేళ గుడుంబా తయారీకి బెల్లం విక్రయిస్తున్నట్లు తేలితేనే యాక్షన్​ తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేటు పెంచిన వ్యాపారులు..

బెల్లం విక్రయాలపై ఆంక్షలు విధించడంతో ఇదే అదనుగా భావించిన కొందరు రేట్లు పెంచి అమ్ముతున్నారు. చుట్టుపక్కల ఉన్న  ప్రాంతాల నుంచి బెల్లం కొనుక్కొచ్చి ధరలు పెంచేస్తున్నారు. మినీ మేడారం, బోనాలు, జాతరలకు  బెల్లం కొరత ఉందని ప్రచారం చేసి.. అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. సాధారణంగా తెల్ల బెల్లం కిలో బుట్ట ధర రూ.40 నుంచి రూ.50  మధ్య ఉంటుంది. కానీ కొరతను సాకుగా చూపి వ్యాపారులు కిలో బెల్లాన్ని రూ.80 నుంచి రూ.100 మధ్య అమ్ముతున్నారు. దీంతో ఆ భారం సగటు వినియోగదారులపై పడుతోంది. దీనిపై ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్​ ను వివరణ కోరగా.. కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు. రూల్స్ ప్రకారం వ్యాపారులు బెల్లం అమ్ముకోవచ్చన్నారు.  గుడుంబా  తయారీకి  అమ్మితే   చర్యలు తప్పవన్నారు.