
హైదరాబాద్: మొన్నటిదాక మెట్రో జర్నీ చాలా చవక అని ప్రచారం చేసుకున్న అధికారులు ప్రయాణికులపై ధరల భారం మోపి శనివారం నుంచి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కనిష్టంగా రూ.2 ..గరిష్టంగా రూ.15 వరకు మాత్రమే పెంచామని ప్రకటనలు చేసినా ఒక్కొక్కరిపై భారీగానే భారం పడనున్నది. తెలివిగా కిలోమీటర్ల చొప్పున స్లాబులను మార్చి ట్రిప్పుపై రూ.15 పెంచడంతో సగటు సామాన్య ప్రయాణికుడిపై నెలకు ఏకంగా సుమారు రూ.వెయ్యి వరకు భారం పడుతోంది.
కిలో మీటర్ల మ్యాజిక్.. రూ.15 అదనం
మెట్రో అధికారులు.. కిలోమీటర్ల ఆధారంగా మ్యాజిక్ చేసి తమ జేబులను కొల్లగొడుతున్నారని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గతంలో రెండు కిలోమీటర్ల చొప్పున ఒక స్లాబ్ఉంటే దాన్ని 6 కిలోమీటర్ల తర్వాత మూడు కిలోమీటర్లకు పెంచారు. పాత స్లాబ్‌లో 10 నుంచి 14 కిలోమీటర్లు అంటే నాలుగు కిలోమీటర్లకు స్లాబ్ఉంటే దాన్ని మూడు కిలోమీటర్లకు కుదించారు. దీనివల్ల తక్కువ ప్రయాణించే వారు కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నది. గతంలో మెట్రోలో 8, 9, 10 కిలోమీటర్లకు రూ.35 ఉంటే దీన్ని 9,10, 11, 12 కిలోమీటర్లుగా మార్చి రూ.50 తీసుకుంటున్నారు. గతంలో 11, 12, 13, 14 కిలోమీటర్లకు రూ.40 ఉంటే దీన్ని ఇప్పుడు13,14, 15 కిలోమీటర్లుగా మార్చి రూ.55 వసూలు చేస్తున్నారు.
గతంలో 15, 16, 17,18 కిలోమీటర్లకు రూ.45 ఉంటే ఇప్పుడు16, 17, 18 కిలోమీటర్లు మార్చి రూ.60 తీసుకుంటున్నారు. గతంలో 19, 20, 21, 22 కిలోమీటర్లకు రూ.50 ఉంటే, తాజాగా 19, 20, 21 కిలోమీటర్లు చేసి రూ. 66 వసూలు చేస్తున్నారు. ఈ స్లాబ్‌లో ఏకంగా 16 పెంచారు. గతంలో 23, 24, 25, 26 కిలోమీటర్లకు రూ.55 ఉంటే ఇప్పుడు 22, 23, 24 కిలోమీటర్లకు రూ.70 చేశారు. దీంతో ఒక సాధారణ ఉద్యోగి ఆఫీసుకు అప్అండ్డౌన్చేస్తే ట్రిప్పుకు రూ.15 చొప్పున రోజుకు రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా నెలకు రూ. వెయ్యి వరకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది.
స్లాబులు గజిబిజి..
గతంలో కిలోమీటర్ల స్లాబుకు, స్లాబుకు మధ్య సగటున రూ.5 వ్యత్యాసం ఉండేది. 2 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే రూ.10, 4 కిలోమీటర్ల వరకు వెళ్తే రూ.15, 6 కిలోమీటర్ల వరకు రూ.25, 8 కిలోమీటర్ల వరకు రూ.30, తర్వాత ప్రతి 4 కిలోమీటర్లకు సగటున రూ. 5 పెంచుతూ రూ.60 వరకు స్లాబ్స్ ఉండేవి. స్లాబ్ కిలోమీటర్మారితే రూ.5 మాత్రమే అదనంగా చెల్లించాల్సి వచ్చేది.
కానీ, ప్రస్తుత స్లాబుల్లో మాత్రం ఒక కిలోమీటర్అటూ ఇటూ మార్చేసి, గత స్లాబుతో పోలిస్తే రూ.10, మరోచోట రూ.12, ఇంకోచోట రూ.16 ఇలా పెంచుకుంటూ పోయారు. గత స్లాబులో గరిష్టంగా 26 కిలోమీటర్ల వరకు రూ.60 చార్జీగా నిర్ణయించారు. ఆపైన ఎంత ప్రయాణించినా రూ.60 చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుత స్లాబ్ లో గరిష్టంగా కిలోమీటర్లను రూ.24కు కుదించారు. రెండు కిలోమీటర్లు తగ్గించడమే కాకుండా గరిష్ట చార్జీని రూ.60 నుంచి రూ.75కి పెంచడం గమనార్హం.