ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకుండా అమ్మేస్తున్నారు

ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకుండా అమ్మేస్తున్నారు

2024 సార్వత్రిక ఎన్నిక‌ల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన‌ ‘భార‌త్ జోడో’ యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. దేశ ప్రజలందరినీ సంఘటితం చేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని రాహుల్ అన్నారు. జాతీయ జెండా కేవలం మూడు రంగులు కాదని..ప్రతి భారతీయుడి స్వేచ్ఛకు అది ప్రతీక అన్నారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల సమైక్యతకు జాతీయ జెండా చిహ్నమని రాహుల్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ఏదో లోటు ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. తమిళనాడుకు తనకు ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

భారత్ జోడో యాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో బీజేపీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ, ఈడీలను విపక్షాలపై అస్త్రాలుగా వాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని..రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి అన్ని వ్యవస్థలపై దాడులు చేయిస్తున్నాయన్నారు. కేంద్రం తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్లే దేశం ఇప్పుడు అత్యంత దుర్భర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు.   

మీడియాను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభంపై మీడియాలో వార్తలు రావడం లేదున్నారు. మీడియా సంస్థలు 24 గంటలు మోడీ భజనే చేస్తున్నాయని మండిపడ్డారు. మత చిచ్చుపెట్టి బీజేపీ దేశాన్ని విభజించాలని భావిస్తోందన్నారు. మత రాజకీయాలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకుండా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. జీఎస్టీ పన్నుల భారంతో రైతులు, సామాన్యులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు కార్పొరేట్ సంస్థలు దేశాన్ని నియంత్రిస్తున్నాయన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్న రాహుల్..ఉద్యోగాలు లేక యువత నిరుత్సాహంలో ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం అసాధ్యమేం కాదన్నారు.