రాత్రిపూట ‘మల్లన్నసాగర్‘ పనులు

రాత్రిపూట ‘మల్లన్నసాగర్‘ పనులు
  • వారం రోజులపాటు పనులు ఆపేయాలని బెంచ్ ఉత్తర్వులు
  • కాని చుట్టూ పహారా ఉంచి రాత్రివేళల్లో పనులు సా గిస్తున్న వైనం
  • ఫొటోలు తీసిన ఏటిగడ్డ కిష్టా పూర్ యువకులు
  • టిప్పర్లతో తొక్కిస్తామంటూ వారికి బెదిరింపులు

సిద్దిపేట, వెలుగు: మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు కావడం లేదు. వారం రోజుల పాటు పనులు ఆపేయాలని బెంచ్ ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ వద్ద రాత్రివేళ పనులు కొనసాగుతున్నాయి. చుట్టూ కాపలా ఉంచి, ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేసి పనులు జరిపిస్తున్నారు.

తెలిసిందిలా..

తొగుట మండల పరిధిలోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లె పహాడ్, తొగుట గ్రామాల్లో మల్లన్న సాగర్ ప్రాజక్టుకు సంబంధించిన పనులు వారం రోజులపాటు నిలిపివేయాలని హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పునర్నిర్మాణం, పునరావాసాలను పూర్తి చేయకుండానే తమ భూముల్లో పనులు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ కొందరు భూనిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను విచారించిన హైకోర్టు.. పనులను ఆపాలని ఈనెల 23న ఆర్డర్ ఇచ్చింది. అయితే తమకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అందలేదంటూ 24, 25 తేదీల్లో కాంట్రాక్టర్ పనులు కొనసాగించాడు.

దీనిపై గత సోమవారం దాదాపు మూడు వందల మంది.. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు. దీంతో సదరు కాంట్రాక్టర్ పనులు నిలిపేశాడు. అయితే పగటి వేళల్లో పనులను ఆపినా, రాత్రి పూట మాత్రం రహస్యంగా పనులను కొనసాగిస్తున్నాడు. పనులు జరిగే ప్రదేశానికి కొంత దూరంలో ఎవరూ రాకుండా కాపాలా ఏర్పాటు చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఏటిగడ్డ కిష్టాపూర్​కు చెందిన కొందరు యువకులు పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడి ఫొటోలను తీశారు. విషయాన్ని గమనించిన కాంట్రాక్టర్ మనుషులు.. యువకులపై బెదిరింపులకు దిగారు. టిప్పర్లతో తొక్కిస్తామని హెచ్చరించారు.

వెహికల్స్​ను పగలు షెడ్లలో ఉంచి..

ఏటిగడ్డ కిష్టాపూర్​తోపాటు పరిసర ప్రాంతాల్లో మల్లన్న సాగర్​ పనులను కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పగటి వేళల్లో వాహనాలను షెడ్లలో ఉంచి, రాత్రిళ్లు మాత్రమే పనులు చేపడుతున్నారు. ఈనెల 30వ తేదీన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు మరోసారి విచారణ చేపట్టే వరకు పనులను నిలిపివేయాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్ మాత్రం కన్​స్ట్రక్షన్ కొనసాగిస్తున్నాడు. గురువారం ఉదయం రాంపూర్​సమీపంలో భూమి చదును చేసే పనులు నిర్వహిస్తుండగా కొందరు ఏటిగడ్డ కిష్టాపూర్​గ్రామస్తులు ఫొటోలు తీయడంతో.. పనులు ఆపేసి వారు వెళ్లిపోయారు.

ఇంటింటి సర్వే చేస్తలేరు

తొగుట పంచాయతీ పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. తొగుటలో రైతు కూలీలు, కుల వృత్తుల వారిని గుర్తించడానికి సర్వే నిర్వహించలేదంటూ గ్రామానికి చెందిన 181 మంది.. జిల్లా కలెక్టర్, ఆర్డీవోను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రీన్​ట్రిబ్యునల్ ఆదేశాలను వెంటనే అమలు చేసి ఇంటింటి సర్వేను నిర్వహించాలని కోరారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి