యువకుడిని కొట్టి చంపి.. కొవిడ్​ డెత్​గా డ్రామా

యువకుడిని కొట్టి చంపి.. కొవిడ్​ డెత్​గా డ్రామా

గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టే ప్రయత్నం
అడ్డుకున్న తల్లిదండ్రులు, బంధువులు
ప్రేమ వ్యవహారంలో మర్డర్​ చేశారని కేసు నమోదు
నిజామాబాద్​ జిల్లాలో ఘటన
 టీఆర్ఎస్ ​లోకల్​ లీడర్లపై ఆరోపణలు 
 డెడ్​బాడీతో గ్రామస్థుల ఆందోళన

మోర్తాడ్, వెలుగు:  నిజామాబాద్​ జిల్లా కమ్మర్​పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడిని టీఆర్ఎస్​ లీడర్, అతని అనుచరులు కొట్టి చంపి కొవిడ్​తో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతుని తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మారుతీనగర్ కాలనీ కి చెందిన మాలావత్​ సిద్దార్థ్(17) హార్వెస్టర్​ నడుపుతాడు. బీజేవైఎం కార్యకర్తగా గ్రామ రాజకీయాల్లో యాక్టివ్​గా ఉంటున్నాడు.  కొంతకాలంగా గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ​నేత కనకం రాజేశ్ బంధువైన యువతిని సిద్ధార్థ్​ ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో సిద్ధార్థ్​, రాజేశ్​ మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో రెండుసార్లు సిద్ధార్థ్​పై రాజేశ్ ​దాడి చేశాడు. కానీ సిద్ధార్థ్​ ప్రేమ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం పనికివెళ్లిన  సిద్దార్థ్ ను రాజేశ్, అతని అనుచరులు కలిసి కిడ్నాప్​చేశారని, ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి కొట్టి చంపేశారని బాధితుని తల్లిదండ్రులు మాలావత్​సరోజ, శ్రీను ఆరోపించారు. 
కొవిడ్​తో చనిపోయినట్లు డ్రామా 
గ్రామస్థుల కథనం ప్రకారం.. రాజేశ్​, అతని అనుచరులు కొట్టిన దెబ్బలకు సిద్ధార్థ్​ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో మెట్​పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పడంతో డెడ్​బాడీని ఊరికి తీసుకొచ్చారు. వస్తూనే  హాసకొత్తూర్​సర్పంచ్​కు ఫోన్​ చేసి, గ్రామానికి చెందిన సిద్ధార్థ్​ కొవిడ్​తో చనిపోయాడని, శివారులో గుంత తవ్వి రెడీగా ఉంచాలని సూచించారు. దీంతో సర్పంచ్ జేసీబీతో గుంత తీసి పెట్టి అతని తల్లిదండ్రులకు ఫోన్ ​చేశారు. విషయం తెలిసిన గ్రామస్థులంతా డెడ్​బాడీ ఖననాన్ని అడ్డుకున్నారు. పొద్దున్నే పనికి వెళ్లిన మనిషి కొవిడ్​తో ఎలా చనిపోతాడని ప్రశ్నించారు. మృతదేహాన్ని టీఆర్ఎస్​ నేత రాజేశ్​ ఇంటి ముందు వేసి  ఆందోళనకు దిగారు. ఇంటిపై కి రాళ్లు విసిరారు. పోలీసులు చేరుకొని బాధితులతో మాట్లాడారు. సిద్ధార్థ్​ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కనుకం రాజేశ్​, ఇంకొందరిపై మర్డర్​ కేసు నమోదు చేశామని ఆర్మూర్​ ఏసీపీ రఘు తెలిపారు.  పూర్తి ఎంక్వైరీ చేసి హంతకులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.  
టీఆర్​ఎస్​నేతలను అరెస్ట్​ చేయాలి :  అర్వింద్
బీజేపీ కార్యకర్త మాలావత్​ సిద్దార్థ్​ను అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్​ నేత కనకం రాజేశ్​, అతని అనుచరులైన బాలాగౌడ్,​ పృథ్వీరాజ్, అన్వేష్  తదితరులు కర్రలు, బీరు సీసాలతో కొట్టి చంపారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. ఈమేరకు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.  టీఆర్ఎస్​నేత, అతని అనుచరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.