సర్వర్ ప్రాబ్లమ్​తో స్టూడెంట్లకు తిప్పలు

సర్వర్ ప్రాబ్లమ్​తో స్టూడెంట్లకు తిప్పలు

హైదరాబాద్/తిమ్మాపూర్, వెలుగు: జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహణ గందరగోళంగా మారింది. రాష్ట్రంలోని పలు సెంటర్లలో సర్వర్ ప్రాబ్లమ్​తో పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్​లోని ఓ సెంటర్​లో ఏకంగా సెకండ్ సెషన్ ఎగ్జామ్ రద్దు చేశారు. అయితే సమస్య గురించి స్టూడెంట్లకు, పేరెంట్స్​కు చెప్పకపోవడంతో వారంతా సెంటర్ల వద్ద ఆందోళనలకు దిగారు. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి12 వరకూ ఫస్ట్ షిప్ట్, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకూ సెకండ్ షిఫ్ట్ పరీక్ష ఉంటుంది. అయితే శుక్రవారం హైదరాబాద్, కరీంనగర్​ జిల్లాల్లోని పలు సెంటర్లలో సర్వర్ ప్రాబ్లమ్ తో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. అబిడ్స్ లోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఉదయం 9కి ప్రారంభం కావాల్సిన పరీక్ష, స్కానింగ్ ప్రాబ్లమ్​తో గంటన్నర ఆలస్యంగా 10.30కు మొదలైంది. ఎగ్జామ్ హాల్​లో సర్వర్ సమస్యతో కంప్యూటర్లు మొరాయించాయి. 90 ప్రశ్నల్లో 29 క్వశ్చన్లు స్ర్కీన్ పై కనిపించలేదని ఇన్విజిలేటర్​కు చెప్పినా, పట్టించుకోలేదు. మధ్యాహ్నం రెండో సెషన్ లోనూ ఇదే సమస్య ఎదురైంది. క్వశ్చన్ పేపర్ ఓపెన్ కాకపోవడంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 6 వరకూ సరిచేసేందుకు సాధ్యం కాకపోవడంతో ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పోలీసులు పేరెంట్స్​ను అదుపులోకి తీసుకున్నారు. మలక్​పేటలోని మూసారంబాగ్​లోని అరోరా పీజీ కాలేజీలోనూ ఇదే సమస్య ఎదురైంది. ఉదయం 9కి ప్రారంభం కావాల్సిన పరీక్షను మధ్యాహ్నం 12.30కు ప్రారంభించారు. ఈ సమస్యపై ఎన్టీఏ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేరెంట్స్ వాపోయారు.   

కరీంనగర్​లోనూ.. 

కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​లోని పలు సెంటర్లలోనూ జేఈఈ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సర్వర్ ప్రాబ్లమ్​తో  మండలంలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది.