పెట్రోల్ బంకులో మోసం.. వాహనదారులకు షాక్ 

పెట్రోల్ బంకులో మోసం.. వాహనదారులకు షాక్ 

రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలోని పలు పెట్రోల్ బంకులు వినియోగదారులను మోసం చేస్తున్న తీరు పలుచోట్ల బయటపడుతూనే ఉన్నాయి.  కొందరు బంకు యజమానులు ఎలక్ట్రానిక్ చిప్ లను అమర్చి పెట్రోల్ పోస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో వినియోగదారులను మోసం చేస్తున్న ఓ పెట్రోల్ బంకు నిర్వాకం బయటపడింది.

బంకు మిషన్ లో ఎలక్ర్టానిక్ చిప్ అమర్చి కస్టమర్లను మోసం చేస్తున్న పెట్రోల్ బంకుపై అధికారులు దాడులు చేశారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుకు చెందిన జీవైఎస్ రెడ్డి ఫిల్లింగ్ స్టేషన్ లో చిప్ అమర్చి మోసం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐదు లీటర్ల పెట్రోల్ పోసుకుంటే దాదాపు500 ఎంఎల్ పెట్రోల్ తక్కువగా వస్తున్నట్లు కొంతమంది వాహనదారులు గమనించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తూనికలు, సివిల్ సప్లై అధికారులు పెట్రోల్ పంపుపై దాడి చేశారు. SOT పోలీసుల సహయంతో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బంకులోని మిషన్లలో ఏర్పాటు చేసిన చిప్ తో పాటు మెమరీని స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్ బంకు యజమానిపై కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.