వైద్య ఆరోగ్యశాఖను మరింత బలోపేతం చేయాలి: మంత్రివర్గ ఉప సంఘం

వైద్య ఆరోగ్యశాఖను మరింత బలోపేతం చేయాలి: మంత్రివర్గ ఉప సంఘం

మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖను మరింత బలోపేతం చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయించారు. సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. మంత్రి ఈటల రాజేందర్  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్,  వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. కరోనా నేపధ్యంలో వైద్య ఆరోగ్యశాఖలో ఎక్కడెక్కడ ఏ మేరకు బలోపేతం చేయాలన్న విషయాలపై స్పష్టత కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.  ప్రజల్లో కూడా రోగాలు.. ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని.. ప్రజల అవసరాలు.. వారి అభిప్రాయాల మేరకు ఎక్కడెక్కడ ఏఏ సౌకర్యాలు కల్పించాలనేదానిపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో అవసరాలకు అనుగుణంగా నివేదికలు రెడీ చేయాలని సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ 365 రోజులు నిరంతరం పనిచేసే శాఖ.. గత ఆరు నెలలుగా అందరూ ఇళ్లకు మాత్రమే పరిమితమైతే మా శాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నం అయిందన్నారు.  కరోనా ప్రభావం వలన వైద్య శాఖ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది.. ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. సీఎం ఆదేశాల మేరకు పని చేస్తున్నాం.. కోవిడ్ సందర్భంగా పనిచేసిన ప్రతి ఒక్క వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఈటెల రాజేందర్.

కోవిడ్ వల్ల వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది –కేటీఆర్

మంత్రివర్గ భేటీలో మంత్రి కె. తారకరామారావు మాట్లాడుతూ..  గత ఆరు నెలలుగా వైద్యఆరోగ్యశాఖ అద్భుతమైన పని చేసిందన్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ నాయకత్వంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రజల్లో భరోసా నింపే విధంగా పనిచేస్తూ కరోనా నుంచి ప్రజలను కాపాడుతోందన్నారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను  మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కోవిడ్ సందర్భంగా ఏర్పడిందన్నారు. రానున్న కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింతగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కేవలం ఆరు నెలలు మాత్రమే కాదు మొత్తం గత ఆరు సంవత్సరాలుగా వైద్య ఆరోగ్యశాఖ అద్భుతమైన పనితీరును కనబరిచి.. అనేక విజయాలను సాధించిందన్నారు. మాతా, శిశు మరణాల రేటు తగ్గించడం నుంచి మొదలుకొని డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు, హాస్పిటల్లలో ఐసీయూ యూనిట్ల ఏర్పాటు, బ్లడ్ బ్యాంకుల ఏర్పాటు, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలను నిర్వహించిందని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు లో పాత్ర పోషించిన ఆశా వర్కర్ నుంచి శాఖాధిపతి హెల్త్ సెక్రటరీ వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.  ఈసారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయి.. ఇందుకు పంచాయతీ రాజ్, మున్సిపల్,  వైద్య ఆరోగ్య శాఖ తో కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యం అయింది.. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో బాగా అవగాహన పెరిగింది.. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో అదుపులో ఉంది. ఇది ముమ్మాటికి వైద్య ఆరోగ్య శాఖ కృషి ఫలితమేనని కేటీఆర్ పేర్కొన్నారు.