రాష్ట్రంలో రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్

రాష్ట్రంలో రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్

రాష్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ, రేపు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేయడంతో  ప్రజలు అవస్థలు పడుతున్నారు. 

మహబూబ్ నగర్ జిల్లాలో రెండు  రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి లోకి భారీగా వర్షం నీరు చేరింది. రాంచంద్రపూర్, మాచన్ పల్లి, సుగుర్గడ్డ తాండా నుంచి 30 మంది విద్యార్థులను మహబూబ్ నగర్ తీసుకెళ్తుండగా బస్సు నీటిలో చిక్కుకుపోయింది. బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణం గానే ఈ ఘటన చోటు చేసుకుందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సూర్యాపేటలోని పలు కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. మానసనగర్, స్నేహనగర్ లో వరదనీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.  నల్లగొండలోని పద్మా నగర్ కాలనీలోని ఓ ఇంటి  గోడకూలి తల్లీకూతుళ్ళు చనిపోయారు. తెల్లవారు జామున నిద్రిస్తున్న సమయంలో గోడకూలడంతో ఇద్దరు స్పాట్ లో చనిపోయారు.  మృతులు నడికుడి లక్ష్మీ,  ఆమె కూతురు కళ్యాణిగా పోలీసులు గుర్తించారు. వీరు శ్రీకాకుళం నుంచి వలస వచ్చి కొన్నేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగుడూర్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ధర్మారం చెరువు అలుగు పోస్తుండటంతో ధర్మారం- లక్ష్మీదేవికాల్వ గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపారుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని  జేవీఆర్ ఓపెన్ కాస్ట్, కిష్టారం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.ఓపెన్ కాస్ట్ గనుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. మధిర నియోజకవర్గంలో చెరువులు అలుగులు పోస్తున్నాయి. మాటూరు దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి దగ్గర వరద తాకిడికి  రోడ్డు కొట్టుకపోయి రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జాలిముడి ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు చేరుతోంది. 
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొర్రేడు వాగు, గోధుమ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. కొత్తగూడెంలోని జీకే ఓసీలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పట్టణంలోని  జాతీయ రహదారి రైల్వే అండర్ బ్రిడ్జి కింద వరద నీరు పోటెత్తి చెరువును తలపిస్తోంది.ములకలపల్లి,దమ్మపేట అశ్వారావుపేట మండలాల్లో వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు మెదక్ జిల్లా నర్సాపూర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రధాన హల్ గోడ వర్షానికి తడిసి కూలిపోయింది.స్లాపు కూడా పడిపోయే దశకు చేరుకుందని జడ్జి అనిత, న్యాయవాదులు తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భూపాపల్లి సింగరేణి ఓపెన్ కాస్టు గనుల్లోనికి నీరు చేరి..బొగ్గు ఉత్పత్తికి నిలిచిపోయింది. ములుగు జిల్లాలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గార్ల దగ్గర మద్దివంచ, గార్ల మధ్య ఉదృతంగా ప్రవహిస్తోంది.పాకాలవాగు వరదతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ములుగు జిల్లా రమణక్క పేట గ్రామంలో వర్షానికి ఇళ్లు కూలడంతో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు.

ఇవాళ అతి భారీ వర్షాలు, రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.