హరీశ్ ప్రోద్బలంతోనే ఎమ్మెల్యేలు సీఎంను కలిసిన్రు : రఘునందన్ రావు

హరీశ్ ప్రోద్బలంతోనే ఎమ్మెల్యేలు సీఎంను కలిసిన్రు : రఘునందన్ రావు
  •  కేసీఆర్ కుటుంబంలో  కుమ్ములాటలు తారాస్థాయికి
  • ఆ ఐదుగురు గెలిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంట
  • మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

సిద్దిపేట/నర్సాపూర్, వెలుగు: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు ప్రోద్బలం,  అనుమతితోనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిసారని, మర్యాద కోసం కలిసినట్టు వారు చెప్తున్న మాటల్లో  నిజం లేదని  దుబ్బాక  మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బుధవారం సిద్దిపేటలో ఆయన  విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. ఆ తర్వాత నర్సాపూర్ మండలం జక్కపల్లిలో  జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.  నియోజకవర్గ అభివృద్ది కోసం ప్రజలే ఎమ్మెల్యేలను  బీఆర్ఎస్​లోకి పంపిస్తున్నారని అప్పట్లో  బావ బామ్మర్దులు వల్లించిన మాటలు ఇప్పుడు  వారికే ఎదురు కొడుతున్నాయన్నారు.  

కేసీఆర్ హయాంలో  ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను  గుంజుకుంటే ఇప్పుడు ఆ ఖర్మ సిద్దాంతం  ఆయనకే చుట్టుకుందన్నారు.  ఈ రోజు నలుగురు వెళ్లారని.. రేపు 26 మంది జమైనంక కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం ఖాయమన్నారు. ప్రజలు  కుటుంబ పాలనను  తిరస్కరించినా బీఆర్ఎస్​ రాజకీయాలను భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తోందన్నారు.    మెదక్ ఎంపీ టికెట్ ను  బీఆర్ఎస్ అమ్ముకోవాలని చూస్తోందని,  కవిత మాత్రం  తనకే టికెట్ ఇవ్వాలని  కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నట్టు చెప్పారు.

దీంతో తానెందుకు బరువు మోయాలని ఆలోచించి హరీశ్​రావు నలుగురు ఎమ్మెల్యేలను సీఎం వద్దకు పంపి ఉంటారని అన్నారు.  కేసీఆర్​  కుటుంబంలో  ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందన్నారు.  కేసీఆర్ కుటుంబం నుంచి ఆ ఐదుగురు రాష్ట్రంలో   ఎక్కడి నుంచి  పోటీ చేసి ఎంపీగా గెలిచినా  తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ జీరో గా మిగలడం ఖాయమని, ఎన్నికల తర్వాత ఆపార్టీ   ఖాళీ అవుతుందన్నారు.   అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రోటోకాల్ బీఆర్​ఎస్​కు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని  ప్రశ్నించారు.  దుబ్బాక లో తనను అడుగడుగునా  బీఆర్​ఎస్​ నాయకులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. వచ్చే  ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లను  బీజేపీ గెలుచుకుంటుందన్నారు.  దౌల్తాబాద్ లో రాముడి పల్లకి సేవపై బూటు విసరడం సరికాదన్నారు.