- మిస్ వరల్డ్‌గా కరోలీనా బీలాస్కా
- పోలెండ్ బ్యూటీకి దక్కిన అందాల కిరీటం
పోర్టోరికో: మిస్ వరల్డ్ 2021 అందాల కిరీటాన్ని పోలండ్ సుందరి కరోలీనా బీలాస్కా దక్కించుకుంది. మిస్ వరల్డ్ 70వ ఎడిషన్ పోర్టోరికో సాన్ జూన్‌లోని కోకాకోలా మ్యూజిక్ హాలులో గురువారం జరిగింది. జమైకాకు చెందిన 2019 మిస్ వరల్డ్ విజేత టోనీ-ఆన్ సింగ్.. 23 ఏండ్ల కరోలీనా బీలాస్కాకు మిస్ వరల్డ్ కిరీటాన్ని పెట్టారు. అమెరికాకు చెందిన శ్రీ సైనీ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఈమె అమెరికన్–ఇండియన్ కావడం విశేషం. కోట్ ది ఐవరీకి చెందిన ఒలీవియా యేస్ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 40 మంది సెమీఫైనలిస్టులు డిసెంబర్లో జరిగిన ఫైనల్స్ కోసం పోర్టోరికో చేరుకున్నారు. కానీ, కరోనా విజృంభణ కారణంగా కంటెస్టెంట్లు వైరస్ బారిన పడటంతో ఈవెంట్ వాయిదా పడింది.
నా జీవితాంతం మరిచిపోలేను: కరోలీనా
‘‘నా పేరు ప్రకటించిన తర్వాత నోట మాట రాలేదు. ఇప్పటి వరకు జరిగిన ఘటనలను ఒకసారి మళ్లీ గుర్తు తెచ్చుకుంటేగానీ జరిగింది నమ్మలేను. ఇప్పటికీ నేను గెలిచానంటే నమ్మలేకపోతున్నాను. మిస్ వరల్డ్ కిరీటం ధరించడం గొప్ప గౌరవం. నా పనిలోకి దిగేందుకు ఇక వేచిచూడలేను. పోర్టోరికోలో జరిగిన ఈ అధ్యాయాన్ని నా జీవితాంతం మరిచిపోలేను”అని ఆనంద భాష్పాల మధ్య కరోలీనా ప్రకటించింది. కరోలీనా విజయం పట్ల తాము చాలా గర్వపడుతున్నామని శ్రీసైనీ, ఒలీవియా స్పష్టం చేశారు. కరోలీనా ప్రస్తుతం మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. ఆ తర్వాత పీహెచ్డీ చేసేందుకు ఆమె సిద్ధమవుతోంది. మోడల్‌గానూ పనిచేస్తున్న ఆమె.. ఏదో ఒక రోజు మోటివేషనల్ స్పీకర్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్విమ్మింగ్ చేయడం, స్కూబా డైవింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడటం కరోలీనాకు ఇష్టం. ఇండ్లు లేని వారికి సహాయం చేయడానికి వలంటరీగానూ కరోలీనా పనిచేస్తోంది. ఇందుకోసం జుపా నా పెయిట్రీని పేరుతో ఒక ప్రాజెక్టును నడుపుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పోలెండ్‌లోని లోడ్జ్ సిటీలో ప్రతి ఆదివారం ఇండ్లు లేని వారికి ఆహారం, తాగునీరు, దుస్తులు, మాస్క్‌లు, న్యాయ సహాయం, వైద్య సహాయం అందిస్తోంది.
11వ ప్లేస్‌లో మన మానస
మన దేశం తరఫున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న మానసా వారణాసి 11వ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. టాప్ 13 కంటెస్టెంట్ల వరకూ మానస చేరుకున్నా.. టాప్ 6లోమాత్రం చోటు దక్కలేదు. హైదరాబాద్‌లో పుట్టిన మానస.. 2020లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలిచి మిస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
