కేంద్రం పేరు, మోడీ ఫొటో పెట్టాల్సిందే

కేంద్రం పేరు, మోడీ ఫొటో పెట్టాల్సిందే

రైతులకు అన్నీ చేస్తే  ఆత్మహత్యలు ఎందుకని ప్రశ్న 

హైదరాబాద్/కామారెడ్డి, వెలుగు: తెలంగాణలోని ప్రతి స్కీంలోనూ కేంద్రం వాటా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రం వాటా ఉన్న ప్రతి స్కీంకు కేంద్రం పేరును, ప్రధాని మోడీ ఫొటోను పెట్టాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. పార్లమెంట్ ప్రవాసీ యోజనలో భాగంగా రాష్ట్రంలో మూడు రోజుల టూర్ ను ముగించుకున్న నిర్మల.. శనివారం సాయంత్రం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మంత్రుల వెటకారాలకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసన్నారు. రేషన్ లో కేంద్రం వాటా, రాష్ట్రం వాటా ఎంత అని ప్రజలకు తెలియజేసేందుకే కలెక్టర్ ను లెక్కలు అడిగానని, అలా అడిగితే అవమానించినట్లా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సరైన డీపీఆర్ లేదని, దీని కోసం రూ. 1. 40 లక్షల కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికీ దీని డీపీఆర్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అప్పుల భారం రాష్ట్ర ప్రజలు భరించాల్సిందేనన్నారు. అందుకే ప్రజల వద్దకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ తప్పులను తెలియజేస్తామని నిర్మల చెప్పారు. 

సెస్ లను రాష్ట్రాలకే ఖర్చు చేస్తం..  

రాష్ట్రాల ట్యాక్స్ లను నిర్ణయించేది ఫైనాన్స్ కమిషన్ మాత్రమేనని, తన చేతుల్లో ఏమీ ఉండదని నిర్మల అన్నారు. రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసే పలు శాఖలకు సంబంధించిన సెస్ లు తిరిగి ఆ రాష్ట్రాలకే ఖర్చు చేస్తామన్నారు. ‘‘హైదరాబాద్ నుంచే అధికంగా పన్నులు వస్తున్నాయి. మరి వాటిని ఇతర జిల్లాలకు ఎందుకు ఖర్చు పెడుతున్నారు?ఎక్కువ పన్నులు ఇస్తే.. ఎక్కువ నిధులు ఇస్తామనేది వర్కవుట్ కాదు. తెలంగాణ ఆదాయంలో 55 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. ఆ నిధులను ఆదిలాబాద్ లో ఖర్చు చేస్తే తప్పెలా అవుతుంది? అక్కడ హైదరాబాద్ ఎంపీ ఫొటో పెడతారా?’’ అని ప్రశ్నించారు. అక్టోబర్ 2020లో వరదల సందర్భంగా కేంద్రం నుంచి ఎస్డీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్​కింద రూ.188 కోట్లు తెలంగాణకు ఇచ్చినా.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదనడం ఏందన్నారు. 

డిజిటైజేషన్ తో పక్కాగా లెక్కలు 

రక్షణ రంగంలో 70 ఏళ్లలో ఎన్నడూ లేని నూతన ఆవిష్కరణలను ప్రధాని మోడీ తెచ్చారని కేంద్ర మంత్రి నిర్మల అన్నారు. శనివారం సోమజిగూడలోని ది పార్క్ హోటల్లో ఫోరమ్ ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో నరేంద్రమోడీ 20 ఏళ్ల పాలనపై జరిగిన సెమినార్ లో నిర్మల మాట్లాడారు. 

వందలో ఐదుగురికే రుణమాఫీ.. 

తెలంగాణలో 100 మందిలో ఐదుగురు రైతులకే రుణమాఫీ జరిగిందని నిర్మలా సీతారామన్​అన్నారు. ఈ లెక్కలు తాను చెప్పట్లేదని, ఎస్బీఐ రిపోర్ట్ లో ఉన్న వివరాలేనన్నారు. వరి, మొక్కజొన్న సాగు చేయవద్దంటూ రైతులను ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు అన్నీ చేస్తే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. 2017–-2018లో స్టేట్​లో 2,937 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటంతో  రైతులు నష్టపోతున్నారని అన్నారు. అన్ని స్కీమ్​ల ద్వారా అగ్రికల్చర్​కు సంబంధించి  8 ఏండ్లలో రాష్ట్రానికి రూ.10,729 కోట్ల ఫండ్స్ ఇచ్చినట్లు తెలిపారు.