- 2027, 2028లలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్
- ఇండియా సహా ప్రపంచమంతా ఎండలు ఎక్కువ.. వర్షాలు తక్కువ
- యాన్యువల్ టు డెకేడల్ క్లైమేట్ అప్డేట్ పేరిట రిపోర్ట్
- 2024లో నమోదైన 1.55 డిగ్రీల పెరుగుదలను బ్రేక్ చేసే అవకాశం
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ఇంకా పూర్తిగా విస్తరించనే లేదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నయ్. జనాలు పిట్టల్లాగా రాలిపోతున్నరు. రోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయేంతలా వడగాడ్పులు వీస్తున్నాయి. అయితే, ఈ ఐదేండ్లపాటూ ఎండల తీవ్రత కొనసాగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2026 నుంచి 2030 వరకు టెంపరేచర్లు పీక్స్‌లో నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గ్లోబల్ యాన్యువల్ టు డెకేడల్ క్లైమేట్ అప్డేట్ పేరిట తాజాగా ఓ రిపోర్టును విడుదల చేసింది. ఆ రిపోర్టులో పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భగ్గుమంటాయని హెచ్చరించింది. సగటు ఉష్ణోగ్రతలు 1850–1900 మధ్య నమోదైన సగటు కన్నా ఎక్కువగా ఉంటాయని, 1.3 నుంచి 1.9 డిగ్రీల వరకు మీన్ యావరేజ్ టెంపరేచర్ నమోదయ్యే చాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది.
2026 నుంచి 2030 మధ్యన ఏదో ఒక సంవత్సరం మాత్రం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని రిపోర్ట్‌లో పేర్కొంది. 2024లో గ్లోబల్ సగటు టెంపరేచర్ పెరుగుదల 1.55 డిగ్రీలుగా రికార్డైందని, ఇప్పటిదాకా అదే రికార్డ్ అని తెలిపింది. రాబోయే ఈ ఐదేండ్లలో ఆ రికార్డ్ బద్దలయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. 1.5 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు 91 శాతం వరకూ ఉన్నాయని హెచ్చరించింది. 2 డిగ్రీల మార్క్‌నూ చేరుకునే అవకాశాలు తక్కువే అయినా.. దానినీ కొట్టిపారేయలేమని రిపోర్ట్‌లో వెల్లడించింది.
ఈ ఐదేండ్లలో ప్రత్యేకంగా రెండేండ్లు మాత్రం డేంజర్ సిచువేషన్ ఉండే అవకాశాలున్నాయని డబ్ల్యూఎంవో రిపోర్ట్ పేర్కొంది. 2027, 2028లలో ఎల్‌నినో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, పసిఫిక్ మహా సంద్రంలో సగటు టెంపరేచర్లు చాలా ఎక్కువగా ఉండే ప్రమాదముందని తెలిపింది. 2026 చివరి నాటికి ఎల్‌నినో బలపడుతుందని, దాని ఎఫెక్ట్ 2027, 2028లలోనూ ఉంటుందని డబ్ల్యూఎంవో సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇండియా, ఆస్ట్రేలియా, కొన్ని ఆఫ్రికన్ దేశాలు, దక్షిణ అమెరికాలోని కొన్ని దేశాల్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఆర్కిటిక్ టెంపరేచర్లు కూడా దారుణంగా పెరిగే అవకాశాలున్నాయని రిపోర్ట్ తెలిపింది. ప్రపంచ సగటు టెంపరేచర్లతో పోలిస్తే మూడున్నర రెట్లు ఎక్కువగా అక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. నవంబర్ నుంచి మార్చి (చలికాలం) మధ్య కాలంలో అక్కడ సగటుకన్నా 2.8 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆ ప్రభావంతో బారెంట్స్ సీ, బేరింగ్ సీ, సీ ఆఫ్ ఓఖోష్క్లలోని ఐస్ కరగడం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కాబట్టి ఇప్పటి నుంచే ఉష్ణోగ్రతలను అదుపు చేసే అంశాలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డబ్ల్యూఎంవో పేర్కొంది. ఉపేక్షిస్తూ పోతే మానవాళి మనుగడకే పెనుముప్పు తప్పదని హెచ్చరించింది.
