ఎమ్మెల్యేను చంపిన వారి పేర్లు ప్రకటించిన ఎన్‍ఐఏ

ఎమ్మెల్యేను చంపిన వారి పేర్లు ప్రకటించిన ఎన్‍ఐఏ
  • దంతేవాడ ఎమ్మెల్యే హత్య కేసులో  20 మంది నక్సల్స్
  • పేర్లు ప్రకటించిన ఎన్‍ఐఏ

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని దంతెవాడ ఎమ్మెల్యే భీమా మండావి హత్యకు సంబంధించి ఎన్ఐఏ(నేషనల్​ఇన్వెస్టిగేషన్​ఏజెన్సీ) 20 మంది మావోయిస్టుల పేర్లను ప్రకటించింది. వారి సమాచారం అందించిన వారికి బహుమతి ఇవ్వడంతోపాటు పేర్లను గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది. నిందితుల్లో మిలటరీ ప్లాటూన్ కమాండర్‍, మోస్ట్ వాంటెడ్‍ హిడ్మా ప్రధాన సూత్రధారిగా పేర్కొంది. అతని చేతికి ఒక వేలు ఉండదని వివరించింది. హిడ్మా 2010లో తాడిమెట్ల వద్ద 76 మంది జవాన్ల హత్యలు, 2013లో జీరంఘాట్‍లో సల్వాజుడుం వ్యవస్థాపకులు మహేంద్రఖర్మతో పాటు 31 మందిని చంపిన, 2017లో బుర్కాపాల్‍లో  22 మంది జవాన్లను చంపిన కేసుల్లో ప్రధాన సూత్రధారి అని వెల్లడించింది. అతనితోపాటు బడా దేవా, సప్పే హుంగా, జయ్‍లాల్, జగదీశ్ కూడాం, లింగే మడకం, మూసా మడావి, మడవి దేవా, మడవి కోసా, కుహరం సునీత, ఉమేశ్​హేమ్లా, మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు కటకం సుదర్శన్‍, మల్లోజుల వేణుగోపాల్‍, గిరిరెడ్డి, తిప్పారి తిరుపతి, గణేశ్, దళ సభ్యులు మిడియం సురేశ్, బార్సే జోగా, మడవి లింగాలు ఉన్నారు. బస్తర్ దండకారణ్యంలో 2019 ఏప్రిల్​లో లోక్‍సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న దంతెవాడ ఎమ్మెల్యే భీమా మండావి వాహనాన్ని మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో ఆయనతోపాటు, ఆరుగురు జవాన్లు మరణించారు. ఈ కేసును చత్తీస్‍గఢ్​సర్కారు ఎన్‍ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ శుక్రవారం 20 మంది మావోయిస్టులను నిందితులుగా ప్రకటించింది.