ఏడేళ్లలో ఐటీ ఉద్యోగులు, ఎగుమతులు రెట్టింపు

ఏడేళ్లలో ఐటీ ఉద్యోగులు, ఎగుమతులు రెట్టింపు
  • ఎగుమతులూ డబుల్​
  • రెండేండ్లలో నల్గొండ, రామగుండం, వనపర్తిలో ఐటీ టవర్లు   
  • రాష్ట్ర జీఎస్డీపీ రూ. 9.78 లక్షల కోట్లు
  • పత్తి చేన్లలో తెగుళ్ల నివారణకు ఏఐ టెక్నాలజీ 
  • రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ శాఖల 2020‑ 21 వార్షిక నివేదికలు విడుదల


హైదరాబాద్, వెలుగు:  ఏడేండ్లలో  రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య, ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు నాటికి హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు ఉండగా, 2020–21 నాటికి రూ.1,45,522 కోట్లకు పెరిగింది. 2014లో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,23,396  ఉండగా, ఇప్పుడు 6,28,615కు చేరింది. రాష్ట్ర ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ 2020–21 వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అలాగే రాష్ట్ర జీఎస్డీపీ ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా, రూ.9.78 లక్షల కోట్లుగా నమోదైందని ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్ మెంట్ 2020–-21 వార్షిక నివేదికలో ప్రకటించింది. ఈ రెండు నివేదికలను గురువారం మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 

టైర్– ‌‌‌‌2 సిటీస్ కు ఐటీ విస్తరణ  

పోయినేడు జులై 21న కరీంనగర్ లో 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ ను ప్రారంభించారు. ఇందులో 556 సీట్ల సామర్థ్యంతో 18 ఐటీ కంపెనీలు పని చేసేలా ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో 41,250 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2020 డిసెంబర్ 7న ప్రారంభించిన ఐటీ టవర్ లో 19 కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక్కడ మరో 31 కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిజామాబాద్, మహబూబ్‌‌‌‌నగర్ లో ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కావొస్తోంది. సీఎం కేసీఆర్ సిద్దిపేటలో 1,21,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో ఐటీ టవర్‌‌‌‌ నిర్మాణానికి పునాది రాయి వేశారు. నల్గొండ, రామగుండం, వనపర్తిలో ఐటీటవర్లు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ గత ఏడాది ప్రస్తుత ధరల్లో రూ.9,65,355 కోట్లుగా నమోదు కాగా, 2020 – 21లో 9,78,373 కోట్లుగా నమోదైంది. దేశ పౌరుల తలసరి ఆదాయం రూ.1,27,768 ఉంటే.. తెలంగాణ పౌరుల తలసరి ఆదాయం రూ.2,27,145 ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. పత్తిలో గులాబీ పురుగు, ఇతర తెగుళ్లను నివారించేందుకు వాద్వాని ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఏఐ అభివృద్ధి చేసిన ఏఐ టెక్నాలజీని 2,800 గ్రామాల్లో వాడుతామని రిపోర్ట్​లో పేర్కొన్నారు. 

ఎంప్లాయిమెంట్​లో మనమే టాప్ 

కరోనా సంక్షోబంలోనూ రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ సెకండ్ వేవ్ కారణంగా కార్యక్రమాన్ని సాదాసీదాగా జరుపుతున్నాం. ట్రాన్స్ పరెన్సీ కోసమే వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నాం. వచ్చే రెండేండ్లలో  రామగుండం, సిద్దిపేట, నల్లగొండలోనూ ఐటీ టవర్లను ప్రారంభిస్తాం. ఎంప్లాయిమెంట్ లో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి.
- ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి కేటీఆర్