ధరల పెరుగుదలపై విపక్షాల నిరసన

ధరల పెరుగుదలపై విపక్షాల నిరసన

ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై పార్లమెంట్ దద్దలిల్లుతోంది. ఈ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ముందు ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈ నిరసనల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని నినాదాలు చేశారు. ధరల పెంపుతో సామాన్యుడు ఎలా బతకాలని ప్రశ్నించారు. గ్యాస్, ఇతర నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. 


అగ్నిపథ్, అధిక ధరలపై విపక్షాల ఫైట్ 
లోక్ సభలో  కాంగ్రెస్, RSP ఎంపీలు వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు. నిత్యావసరాలపై 5 శాతం GST పెరుగుదలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు . కేరళలో నీట్ ఎగ్జామ్ టైంలో విద్యార్థినులు ఎదుర్కొన్న ఇబ్బందులపై చర్చించాలని  RSP ఎంపీ ప్రేమచంద్రన్ వాయిదా తీర్మానం ఇచ్చారు. మరోవైపు రాజ్యసభలో RJD ఎంపీ మనోజ్ ఝా, CPI-M ఎంపీ కరీం జీరో అవర్ నోటీసులిచ్చారు. రూల్ 267 కింద GST పెరుగుదలపై చర్చించాలని ఎంపీ కరీం అన్నారు. అగ్నిపథ్ స్కీంపై, RRB స్టూడెంట్ల భవితవ్యంపై చర్చించాలని మనోజ్ ఝా జీరో అవర్ నోటీసులిచ్చారు.

పార్లమెంటులోని గాంధీ విగ్రహం దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. అర్వింద్ కేజ్రీవాల్  సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సింగపూర్ సమ్మిట్ కు వెళ్లకుండా ఆపగలరు కానీ.. కేజ్రీవాల్ మోడల్ అభివృద్ధిని మాత్రం ఆపలేరని ప్లకార్డులు ప్రదర్శించారు.