హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉపాధి హామీ ఉద్యోగుల చిరకాల కోరికైన పే స్కేల్‌ను వర్తింపజేయాలని కోరుతూ మంగళవారం ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ నాయకులు సచివాలయంలో మంత్రి సీతక్కను కలిశారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో జరగబోయే శాఖాపరమైన సమీక్షా సమావేశంలో ఈ పే స్కేల్ అంశాన్ని ప్రత్యేకంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.
మంత్రితో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్‌లను కూడా జేఏసీ నాయకులు కలిశారు. ఉపాధి హామీ ఉద్యోగుల సుదీర్ఘ సర్వీసులను పరిగణనలోకి తీసుకుని పే స్కేల్ అమలు చేసేలా చూడాలని కోరుతూ వారికి వినతిపత్రాలు అందజేశారు.
మంత్రిని కలిసిన వారిలో ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎలబద్రి లింగయ్య, కో-చైర్మన్లు మురహరి విజయ్, వెంకట్రామిరెడ్డి, అంజిరెడ్డి తదితరులు మోహన్ రావు, రఘు, గిరి గౌడ్, నాగభూషణం, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
