ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

దసరా ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు రెడీ అయ్యారు. రాష్ట్రంలోనే ఫేమస్ అయిన వరంగల్​ఉర్సు గుట్ట(రంగలీలా మైదానం)లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మైసూర్‍ తరహాలో ఏటా ఇక్కడ రావణాసుర వధ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దీనికోసం గత రెండు వారాలుగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

60 ఫీట్ల రావణుడి ప్రతిమలు.. లేజర్ షో
రంగలీలా మైదానంలో ఈసారి 60 ఫీట్లతో రావణుడి కటౌట్లను ఏర్పాటు చేశారు. వాతావరణ కాలుష్యం కాకుండా ఉండేందుకు ఈసారి ఎకో ఫ్రెండ్లీ బాణాసంచాలు తెప్పించారు. ప్రత్యేక లేజర్ షో నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు హాజరుకానున్నారు.లక్షమందికి పైగా జనాలు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్, తాగునీరు ఇతర సౌకర్యాలపై దృష్టిపెట్టారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు, వర్ధన్నపేట పట్టణంలోనూ రావణాసుర వధకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. నర్సంపేట పట్టణంలోని అంగడి బజార్ లో పది తలల భారీ రావణాసురిడి ప్రతిమను నిల్చోబెట్టారు. దాదాపు 12వేల మంది ఈ ప్రోగ్రాంకు హాజరవుతారని అంచనా.

ములుగులోనూ..
ములుగు పట్టణంలోని ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే రావణాసుర వధ అంతా సిద్ధం చేశారు. ములుగు శివారులోని సాధన హైస్కూల్ సమీప గ్రౌండ్లో భారీ ప్రతిమను ఏర్పాటు చేశారు. వేడుకల్లో మల్లెపందిళ్లు, నాగిని నృత్యాలు, పేరిణి, కూచిపూడి, భరతనాట్యం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో ఉత్తమసేవలందించిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. కాగా, ఈ ప్రోగ్రాంకు ఏటా జాతీయవాది, రిటైర్డ్ ప్రొ.గుజ్జుల నర్సయ్య హాజరయ్యేవారు. ఇటీవల ఆయన మరణించడంతో.. వేడుకల్లో ఆయన లేని లోటు కనిపిస్తోందని ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.