నెమలిని షూట్​ చేసిన వ్యక్తి అరెస్ట్

నెమలిని షూట్​ చేసిన వ్యక్తి అరెస్ట్
  •     రైఫిల్, బుల్లెట్లు, గొడ్డలి స్వాధీనం
  •     జగిత్యాల జిల్లా పెగడపల్లిలో ఘటన
  •     నిందితుడి కొడుకు ములుగు జిల్లాలో డీఎస్పీ
  •     కేసు వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్

పెగడపల్లి (జగిత్యాల), వెలుగు: జగిత్యాల జిల్లాలో జాతీయ పక్షి నెమలిని గన్​తో షూట్ చేసి చంపిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపినట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. వారి నుంచి గన్, బుల్లెట్లు, గొడ్డలితో పాటు నెమలి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. పెగడపల్లి పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మంగళవారం వెల్లడించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లికి చెందిన నలువాల సత్యనారాయణ.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామ శివారులో గన్​తో నెమలిని వేటాడాడు. 

తర్వాత దాన్ని తన కారులో తరలించే ప్రయత్నం చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో అయితుపల్లి గ్రామ శివారులో తనిఖీలు చేపట్టారు. కారులో నుంచి నెమలి కళేబరాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్​గా వచ్చిన జవ్వాజి రాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సత్యనారాయణ 2017లో భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్​లో జింకలను వేటాడిన కేసులో అరెస్ట్ అయ్యాడు. తర్వాత బెయిల్​పై బయటికొచ్చాడు. మళ్లీ తాజాగా నెమలిని చంపి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. 

సత్యనారాయణ వద్ద నుంచి 0.22 స్పోర్టింగ్ రైఫిల్ గన్, 34 బుల్లెట్లు, గొడ్డలి, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపినట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. కాగా, నిందితుడు సత్యనారాయణ కొడుకు ములుగు జిల్లాలో డీఎస్పీ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు. నిందితులను పట్టుకున్న మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై రామకృష్ణ, ఏఎస్సై సత్తయ్య, సిబ్బందిని ఎస్పీ సన్​ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్ ను అభినందించారు.