టీఆర్ఎస్ లోకి ఈటల క్యాడర్.. చేరిక వెనుక రూ.5 కోట్ల డీల్.!

టీఆర్ఎస్ లోకి ఈటల క్యాడర్.. చేరిక వెనుక రూ.5 కోట్ల డీల్.!

ఈటల రాజేందర్  వెంట  ఉన్న క్యాడర్ ను  తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు స్పీడప్ చేసింది టీఆర్ఎస్. మంత్రి వర్గం నుంచి  బర్తరఫ్ అయ్యాక ఈటలకు  అండగా నిలిచిన  నియోజకవర్గంలోని  స్థానిక  ప్రజాప్రతినిధులు,  లోకల్ లీడర్లకు మళ్లీ గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. ఈ మార్పు వెనక  ఐదు కోట్ల  డీల్ జరిగిందని ఆరోపిస్తున్నారు ఈటల. నిన్నటివరకు జై ఈటల అంటూ మాజీమంత్రి ఈటల రాజేందర్  వెంట తిరిగిన నేతలు .. రాత్రికి రాత్రే మనస్సు మార్చుకుని అధికార పార్టీలో చేరుతున్నారు. మొదటిరోజు పాదయాత్రలో పాల్గొనడంతో పాటు.. గతంలో టీఆర్ఎస్ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడిన నియోజకవర్గంలోని ఇల్లందకుంట ఎంపీపీ పావని, ఆమె భర్త వెంకటేశ్.. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారు. వీరితో పాటు.. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య గౌడ్, మరికొంత మంది నేతలు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. వీళ్లంతా ఈటలకు మద్ధతు పలికిన వాళ్లే. అందరినీ టీఆర్ఎస్ నేతలు, మంత్రులు పిలిపించుకుని మాట్లాడి తమవైపు తిప్పుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయని, ప్రలోభాలతో పాటు, వాళ్లకున్న వ్యాపారాలు, అర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తామని బెదిరించి తమవైపు తిప్పుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలనే టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందంటూ ఈటల రాజేందర్ కొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు. ఇల్లందకుంట నేతల చేరిక వెనక ఐదు కోట్ల రూపాయల డీల్ జరిగిందంటున్నారు ఈటల.

ఇల్లందకుంట నేతలకంటే ముందు  హుజరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన మెజార్టీ ప్రజాప్రతినిధులు మొదట్లో ఈటలకు మద్దతు ప్రకటించినట్లే ప్రకటించి.. ఆ తర్వాత టీఆర్ఎస్ వైపు వెళ్లారు. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత ... ఆయన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో ఏకాకిని చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ కు అనుకూలంగా మాట్లాడిన వారిలో చాలా మందిని ఇప్పుడు తమవైపు తిప్పుకుంది. ఈటలకు మొదటి నుంచి అండగా ఉన్న హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక .. మంత్రి పదవి నుంచి  ఈటల బర్తరఫ్ అయ్యాక  ఆయన మొదటిసారి  నియోజకవర్గానికి వచ్చినప్పుడు మంగళహారతులిచ్చి  స్వాగతం పలికారు. ఆమే ప్లేట్ ఫిరాయించి తిరిగి టీఆర్ఎస్ లో కొనసాగుతానని ప్రకటించారు.

ఈటల రాజేందర్ కు అనుచరులుగా పేరున్న చాలా మంది ఇప్పుడు తిరిగి టీఆర్ఎస్ పంచన చేరారు. ఒక్కొక్కరుగా ఈటల శిబిరం నుంచి జారుకోవడం వెనక పెద్ద ఎత్తున ప్రలోభాలు, బెదిరింపులు కొనసాగాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఈటలకు మద్దతు తెలిపి మళ్లీ టీఆర్ఎస్ లో చేరిన వాళ్లలో హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక, వైస్ ఛైర్ పర్సన్ నిర్మల, 11 మంది కౌన్సిలర్లు, జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, వీణవంక మాజీ సింగిల్ విండో ఛైర్మన్ సాధవరెడ్డి, జెడ్పీటీసీగా ఉన్న ఆయన భార్య వనమాల... ఈటల ప్రధాన అనుచరుడు బండ శ్రీనివాస్ ఉన్నారు. అయితే వీళ్లంతా తాము మొదటి నుంచి టీఆర్ఎస్ లోనే ఉన్నామని.. ఈటల మాత్రమే పార్టీ మారారని చెప్పుకుంటున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటు, 127 గ్రామ పంచాయితీల్లోని నేతలు, గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్ల విజయం వెనక ఈటల పాత్ర ఉంది. కానీ వీరిలో 90 శాతం మంది ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈటలపై అభిమానమున్నప్పటికీ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి ప్రలోభాలు, బెదిరింపులే కారణమన్న విమర్శలున్నాయి.నియోజకవర్గానికి చెందిన చాలామంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పిడికెడు మంది నాయకులను మీవైపు తిప్పుకోవచ్చేమోగానీ.. నియోజకవర్గ ప్రజలంతా నా వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు ఈటల రాజేందర్.