డీజీపీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుండగా అక్రమంగా అరెస్ట్ చేశారు : కానిస్టేబుల్ అభ్యర్ధులు

డీజీపీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుండగా అక్రమంగా అరెస్ట్ చేశారు : కానిస్టేబుల్ అభ్యర్ధులు

నిరసనలు తెలియజేయకుండా.. శాంతియుతంగా డీజీపీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆరోపించారు. ఆగస్టు 8వ తేదీన నిర్వహించిన పరీక్షలో తప్పుడు ప్రశ్నల కారణంగా తాము నష్టపోయామని, ఈ అంశంపై ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. న్యాయస్థానం ఈ అంశంపై మంగళవారం తీర్పు ఇవ్వనుందన్నారు. అందులో భాగంగా శాంతియుతంగా డీజీపీకి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించాలని కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ విషయాన్ని సరూర్ నగర్ సీఐ, ఎస్ఐలకు తెలిపామన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా..శాంతియుతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. 

ఇవాళ ఉదయం గాంధీభవన్ వైపు వెళ్తుండగా.. పోలీసులు తమను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని  కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలున్న చంటి బిడ్డలతో వచ్చిన తల్లులను సైతం నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని వాపోయారు. సుమారు 500 మంది అభ్యర్థులను ఎక్కడికక్కడే అరెస్టులు చేశారని వివరించారు. పరీక్షలో 200 ప్రశ్నలు ఇచ్చారని.. అందులో చాలా వరకూ తప్పులు ఉన్నాయన్నారు. నిరుద్యోగులు రోడ్డుపై నడిచే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానం ఆదేశాలను అధికారులు పాటించాలని విజ్ఞప్తి చేశారు.