బీఆర్కే భవన్​లో బతుకమ్మపై ఆంక్షలు

బీఆర్కే భవన్​లో బతుకమ్మపై ఆంక్షలు

హైదరాబాద్, వెలుగు: తాత్కాలిక సెక్రటేరియట్​అయిన బీఆర్కే భవన్​లో బతుకమ్మ ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సెక్రటేరియట్ మహిళ ఉద్యోగులు ఏటా 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మను నిర్వహించేవారు. కానీ ఈ సారి ఒకే రోజుకు పోలీసులు పరిమితం చేశారు. బీఆర్కే భవన్ లో బతుకమ్మ ఉత్సవాలకు ప్లేస్ లేదని, బయట రోడ్డు మీద వాహనాల పార్కింగ్ , ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని వారు అడ్డుచెప్పారు. దీంతో శుక్రవారం అది కూడా కొంతసేపు మాత్రమే మహిళ ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. సెక్రటేరియెట్ లో బతుకమ్మ ఉత్సవాలకు ప్రభుత్వం సుమారు రూ. 10 లక్షలు విడుదల చేసినట్లు సమాచారం. ఉత్సవాలకు ఆంక్షలు విధించడంపై మహిళా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత సెక్రటేరియట్ లో 9 రోజుల పాటు ఘనంగా చేసే వాళ్లమని, ఇప్పుడు ఇలా ఆంక్షలు విధించడం ఏమిటని మండిపడుతున్నారు.