
- రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
- కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపేటలో ఘటన
- రూ.5.37 లక్షలు పోగు చేసి ఇచ్చిన గ్రామస్తులు
- మరో రూ.5 లక్షలు ఖర్చు చేసిన కుటుంబ సభ్యులు
- పరిస్థితి విషమించడంతో మృతి.. గ్రామస్తులు కన్నీరుమున్నీరు
హుజురాబాద్ రూరల్, వెలుగు: తమ గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడటం.. ట్రీట్మెంట్కు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడంతో గ్రామస్తులంతా స్పందించారు. అప్పటికప్పుడు రూ.5.37 లక్షలు పోగు చేసి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. యువకుడి ఫ్యామిలీ మెంబర్స్ మరో రూ.5 లక్షల వరకు ఖర్చు చేసి ట్రీట్మెంట్ చేయించారు. అయినా.. ఆ యువకుడి ప్రాణం నిలవలేదు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన పూజారి డింగరి నవ్యనందాచార్యులు (29) ఈ నెల 7న వినాయక మండపాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు చేసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.
ఈ క్రమంలో బండికి కుక్కలు అడ్డురావడంతో అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన గ్రామస్తులు.. అతన్ని హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్మెంట్కు భారీ మొత్తంలో డబ్బులు అవసరం కావడంతో పోతిరెడ్డిపేటకు చెందిన గ్రామస్తులు, మహాత్మా గాంధీ వర్సిటీ మాజీ వీసీ గోపాల్‌రెడ్డి, ఎల్ఎండీ ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ కిషన్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, హరికృష్ణా రెడ్డి సహా 64 మంది దాతలు రూ.5.37 లక్షలను జమ చేసి కుటుంబ సభ్యులకు అందించారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మరో రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. 18 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన నవ్యనందాచార్యులు.. గురువారం చనిపోయాడు.