తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ లకు ప్రమోషన్లు వచ్చిన పాత పోస్టులే

తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ లకు ప్రమోషన్లు వచ్చిన పాత పోస్టులే

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎప్పుడూ లేని చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చాలా లేటుగా ప్రమోషన్లు అందుకున్న ఆఫీసర్లు ఆర్నెల్లు అవుతున్నా అవే పోస్టుల్లో కొనసాగుతున్నారు. వేరే రాష్ట్రాల్లో తమ బ్యాచ్ ఐపీఎస్ లతో పోలిస్తే ప్రమోషన్లు ఆలస్యంగా వచ్చినప్పటికీ పోస్టింగులు మార్చలేదు. దీంతో పాత ర్యాంకుల్లో పాత కుర్చీల్లోనే కొనసాగుతున్నారు. వీరికి పేరుకు ప్రమోషనే గానీ అప్ గ్రేడ్ పోస్టులు దక్కలేదు.

ఆర్నెల్ల కింద ఐదుగురు ఐపీఎస్ లకి అడిషనల్ డీజీలుగా, నలుగురికి ఐజీలుగా, ఏడుగురికి డీఐజీలుగా, ఆరుగురికి సీనియర్ స్కేల్ అధికారులుగా ప్రమోషన్లు ఇస్తూ సర్కారు ఆదేశాలిచ్చింది. అయినా పోస్టింగ్ మారకపోవడంతో వాళ్లు పాత పోస్టుల్లోనే పనిచేస్తున్నారు. అంటే జిల్లా ఎస్పీ నుండి డీఐజీగా ప్రమోషన్ వచ్చినా అదే హోదాలో ఎస్పీలుగా కొనసాగుతున్నారు. డీఐజీ నుండి ఐజీ అయినా, ఐజీ నుండి అడిషనల్ డీజీ అయినా హోదాలు మారినయి తప్ప కింది ర్యాంకు అధికారులుగానే పనిచేస్తున్నారు. వీరిలో సీనియర్ ఎస్పీ నుండి డీఐజీలుగా ప్రమోషన్ పొందిన 2004 బ్యాచ్ ఐపీఎస్ లు, డీఐజీ నుండి ఐజీలుగా ప్రమోషన్ పొందిన 2001 బ్యాచ్ ఐపీఎస్ లతో పాటు ఐజీ నుండి అడిషనల్ డీజీలుగా ప్రమోషన్ పొందిన 1994 ఐపీఎస్ లు ఉన్నారు. ఇప్పుడు డీసీపీలు, ఎస్పీలుగా పనిచేస్తున్న కమలాసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివకుమార్, అవినాష్ మొహంతి, విశ్వప్రసాద్, రమేష్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ కు డీఐజీలుగా ప్రమోషన్లు వచ్చాయి. ప్రస్తుతం డీఐజీలుగా పనిచేస్తున్న ప్రభాకర్ రావు, అకున్ సబర్వాల్, సుధీర్ బాబు, ప్రమోద్ కుమార్ ఐజీలుగా ప్రమోటయ్యారు. ఐజీలుగా ఉన్న శివధర్ రెడ్డి, సౌమ్యమిశ్రా, షిఖా గోయల్, శ్రీనివాస్ రెడ్డి, అభిలాష్ బిష్త్ కు అడిషనల్ డీజీలుగా ప్రమోషన్లు వచ్చాయి. అయినా ఆర్నెల్లుగా వీళ్లు అవే పోస్టుల్లో కొనసాగుతున్నారు. సీఎం దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉండడం వల్లే వీరికి పోస్టులు మారలేదని తెలుస్తోంది.

బదిలీల్లేవ్… ఖాళీలే

ఇప్పటికే పోలీస్ శాఖలో బదిలీలు ఆగడంతో చాలా పోస్టులు అధికారుల్లేక ఖాళీగా ఉన్నాయి. వీటిలో వరంగల్ రేంజ్ డీఐజీ, కరీంనగర్ రేంజ్ డీఐజీ లాంటి పోస్టులూ ఉన్నాయి. మరోవైపు ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఏపీకి డెప్యూటేషన్‌‌‌‌పై వెళుతుండడంతో హైదరాబాద్ రేంజ్ వెస్ట్ జోన్ ఐజీ పోస్ట్ ఖాళీ అయ్యింది. ఈ పోస్టులో ఇప్పుడు నార్త్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఇంచార్జి ఐజీగా పనిచేస్తున్నారు. ఐటీ జోన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో జాయింట్ కమిషనర్ పోస్టు ఏడాదిగా ఖాళీగానే ఉంది. ఇంకా ఐజీ శశిధర్ రెడ్డి ఇప్పటికే రిటైర్ కాగా ఐజీలు శివప్రసాద్, మురళీకృష్ణ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నారు. దీంతో కీలక పోస్టుల్లో నడిపించేవాళ్లు లేక మరిన్ని ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి చాలా ప్రభుత్వాల్లో పనిచేసినవాళ్లు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కింది స్థాయి సిబ్బందిపై నియంత్రణ తగ్గి కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.