ఢిల్లీలో పోటాపోటీగా నిరసన దీక్షలు

ఢిల్లీలో పోటాపోటీగా నిరసన దీక్షలు

ఢిల్లీలో పోటాపోటీగా నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ దగ్గర బీజేపీ ధర్నాకు దిగింది. వాస్తవానికి జంతర్‌మంతర్‌లోనే ఈ నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు సైతం చేసుకుంది. అయితే.. భారత జాగృతి సంస్థ మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ జంతర్‌మంతర్‌లోనే మార్చి 10వ తేదీన దీక్ష చేస్తోంది. ముందుగానే అనుమతి కూడా తీసుకుంది. ఆ తర్వాత బీజేపీకి దీన్ దయాల్ మార్గ్ లో నిరసన దీక్ష చేపట్టేందుకు అవకాశం ఇచ్చారు. 


ఇటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. దేశంలోని మహిళా హక్కుల సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఈ దీక్షకు హాజరుకానున్నారు.