Producer SKN: సోషల్ మీడియాలో అసభ్య ట్రోలింగ్‌.. చట్టపరమైన చర్యలకు సిద్ధమైన ‘ది రాజా సాబ్’ నిర్మాత

Producer SKN: సోషల్ మీడియాలో అసభ్య ట్రోలింగ్‌.. చట్టపరమైన చర్యలకు సిద్ధమైన ‘ది రాజా సాబ్’ నిర్మాత

సినీ నటీనటులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న కొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లపై సినీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడు (SKN) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం (2026 జనవరి 23న) ఆయన ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు.

కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, దీనివల్ల ది రాజా సాబ్ సినిమా యూనిట్‌తో పాటు నటీనటుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తన పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించి, ది రాజా సాబ్ సినిమా మరియు అందులోని నటీనటులను ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాత SKN కోరారు.

ఈ సందర్భంగా SKN మాట్లాడుతూ.. “కొంతమంది వ్యక్తులు నా పేరుతో తప్పుడు పోస్టులు పెడుతూ ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తున్నారు. సినిమాపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇలాంటి చర్యలను మేము ఉపేక్షించం. హద్దులు దాటితే ఊరుకోం. ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలోనే బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు” అని తెలిపారు.

"కొందరు వ్యక్తులు నా పేరుతో తప్పుడు పోస్ట్‌లు పెడుతూ ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తున్నారు. సినిమాపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇలాంటి వారిని ఉపేక్షించబోం. హద్దులు దాటితే ఊరుకోం. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. త్వరలోనే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి" అని ఎస్‌కేఎన్ పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

ది రాజా సాబ్ సినిమా కొంతమంది ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా లేదన్న అభిప్రాయాల అనంతరం, దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్‌లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. అయితే కొన్ని అకౌంట్లు హద్దులు దాటి అసభ్య పదజాలంతో వ్యక్తిగత దాడులకు దిగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఈ వ్యవహారం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, తప్పుడు ప్రచారం, ఆన్‌లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్‌కేఎన్ చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కే అయినప్పటికీ, అవమానకరమైన భాషను ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సమర్థనీయం కాదని ఆయన సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, కొంతకాలంగా తగ్గిన ట్రోలింగ్ మరోసారి దర్శకుడు మారుతిపై మొదలైంది. పలువురు చేసిన వ్యాఖ్యలు మర్యాదా హద్దులు దాటుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభాస్ అభిమానులు సంయమనం పాటించాలని, విజయం–పరాజయం ప్రతి నటుడి కెరీర్‌లో సహజమేనని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.

రాజా సాబ్ కలెక్షన్స్:

భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘రాజా సాబ్’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజే రూ.112 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించినప్పటికీ, నెగటివ్ రివ్యూల ప్రభావంతో ఆ తర్వాత వసూళ్లు భారీగా పడిపోయాయి. అయినప్పటికీ, విడుదలైన 14వ రోజుకు సినిమా వరల్డ్ వైడ్గా సుమారు రూ.250 కోట్లకి పైగా గ్రాస్, ఇండియాలో రూ.142.08 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.