- వచ్చే లిస్టులో అధికారికంగా ప్రకటించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: బీజేపీలో మిగిలిన రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఆ రెండు సీట్లను కొత్తవారికే ఇచ్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మొత్తం17 స్థానాలకు గాను15 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మిగిలిన వరంగల్, ఖమ్మం సీట్లపై కొంతకాలంగా కసరత్తు నడుస్తోంది. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు వరంగల్ సీటు దాదాపు కన్ఫామ్ కాగా, ఖమ్మం సీటుపై మాత్రం స్పష్టత రాలేదని తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జలగం వెంకట్రావ్ కు ఆ సీటు ఇస్తారనే ప్రచారం జరిగినా.. ఆ తర్వాత మరో సీనియర్ నేత బీజేపీలో చేరుతున్నారని, ఆయనకే ఆ సీటు కేటాయించే అవకాశం ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి. అందుకే ఆ సీటును ప్రకటించలేదని కొందరు నేతలు చెప్తున్నారు. అయితే, తర్వాతి లిస్టులో ఈ రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీజేపీ నేతలను కలిసిన జలగం..
ఖమ్మం సీటు ఆశిస్తున్న జలగం వెంకట్రావ్ మంగళవారం బీజేపీ ఆఫీసుకు వచ్చారు. పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలను తాను మర్యాదపూర్వకంగా కలవడానికే వచ్చానని చెప్పారు. టికెట్ ఎందుకు ఆగిందనేది చెప్పేది తాను కాదని.. పార్టీ నేతలు చెప్పాలని అన్నారు. ఈ మధ్యనే జాయిన్ అయిన తాను పార్టీ గురించి మాట్లాడటం సరికాదని, సరైన సమయంలో పార్టీ టికెట్ అనౌన్స్ చేస్తుందని చెప్పారు. ఖమ్మం టికెట్ టీడీపీకి ఇస్తారనే చర్చ పార్టీలో లేదన్నారు.
