యుద్ధ ట్యాంకులిస్తామని జర్మనీ ప్రకటించిన మరుసటిరోజే రష్యా దాడి

యుద్ధ ట్యాంకులిస్తామని జర్మనీ ప్రకటించిన మరుసటిరోజే  రష్యా దాడి
  • 47 కూల్చేసిన ఉక్రెయిన్
  • ఒకరి మృతి, ఇద్దరికిగాయాలు

కీవ్​:  ఉక్రెయిన్​ ఆర్మీకి 88 అత్యాధునిక యుద్ధ ట్యాంకులను అందించి, త్వరలోనే ట్రైనింగ్ ఇస్తామని జర్మనీ  ప్రకటించిన మరుసటి రోజే రష్యా విరుచుకుపడింది.  బుధవారం అర్ధరాత్రి తర్వాత రాజధాని కీవ్​ నగరంపై మిసైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు జరిపింది. ఈ దాడిలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరికి  గాయాలయ్యాయని కీవ్​ మేయర్​ విటాలీ క్లిష్కో తెలిపారు.  బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం  ఉదయం వరకు కీవ్​లో ఎయిర్​రైడ్​ సైరన్ల మోతలు వినిపించాయన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురై అండర్​ గ్రౌండ్​ మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారని చెప్పారు.

దాడులను సమర్థంగా తిప్పికొట్టామని, రష్యా 55 క్రూయిజ్​ మిస్సైళ్లను ప్రయోగించగా 47 కూల్చేశామని ఉక్రెయిన్​ ఆర్మీ వెల్లడించింది. మరో 24 డ్రోన్లను కూల్చినట్లు తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు లక్ష్యంగా రష్యా సైన్యం దాడులు చేసిందని ఒడెసా గవర్నర్​ తెలిపారు. ఈ పరిణామాలపై రష్యా రక్షణ శాఖ స్పందిస్తూ.. “యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా, యూరప్​ దేశాలు  ఉక్రెయిన్​ కు హామీ ఇవ్వడమనేది.. ఈ ప్రాంతంలో వాటి ప్రత్యక్ష పాత్ర పెరుగుతున్న తీరుకు నిదర్శనం.  అందుకే మేం స్పందించాల్సి వస్తోంది”అని స్పష్టం చేసింది. యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్​ కు అందిస్తామని అమెరికా  కూడా ప్రకటన చేసింది.