గుర్తుకొస్తున్నాయి.. కల్లలైన కలలను తలుచుకుంటూ ఉక్రెయిన్ విద్యార్థులు

గుర్తుకొస్తున్నాయి.. కల్లలైన కలలను తలుచుకుంటూ ఉక్రెయిన్ విద్యార్థులు

రష్యా దాడులు ఉక్రెయిన్ విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేశాయి. భవిష్యత్తు, ఉన్నత చదువుల గురించి ఎన్నో కలలు గన్న విద్యార్థుల ఆశలను చిన్నాభిన్నం చేశాయి. ఎంతో ఉత్సాహంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించుకోవాల్సిన విద్యార్థులు శిథిలమైన తమ స్కూలు బిల్డింగుల ముందు గ్రూపు ఫొటోలు దిగాల్సిన పరిస్థితులు తలెత్తాయి. తమ పక్కనే శిథిలాలు కనిపిస్తున్నా తాము నిర్భయంగా ఉన్నామని ఆ ఫొటోల ద్వారా విద్యార్థులు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. 

ర‌ష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఇప్పుడు ఎటుచూసినా శిథిల భ‌వ‌నాలు, శ‌వాల కుప్ప‌లు క‌నిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ప్ర‌జ‌లు నిత్యం బాంబు శ‌బ్దాల మ‌ధ్యే జీవ‌నం కొనసాగిస్తున్నారు. కొందరు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని వ‌ల‌సపోతున్నారు. త‌మ కన్నీటిగాథలను వ్య‌క్తప‌రిచేందుకు ఉక్రెయిన్ విద్యార్థులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. ర‌ష్యా బాంబు దాడుల్లో శిథిల‌మైన స్కూలు భ‌వ‌నాల వ‌ద్ద గ్రాడ్యుయేష‌న్ ఫొటోషూట్ నిర్వహించుకున్నారు. 

ర‌ష్యా బాంబు దాడుల్లో చెర్నిహివ్ ప‌ట్ట‌ణంలోని చాలా భ‌వ‌నాలు శిథిల‌మయ్యాయి. కొంత‌మంది హై స్కూల్ విద్యార్థులు త‌మ గ్రాడ్యుయేష‌న్ డే ద్వారా త‌మ బాధ‌ను ప్ర‌పంచానికి తెలియజేయాలనుకున్నారు. శిథిల భ‌వ‌నాల సాక్షిగా త‌మ‌ గ్రాడ్యుయేష‌న్ డే ఫొటో షూట్ చేశారు. ఉత్త‌ర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లో 40 మంది విద్యార్థులు చాలా ముఖ్య‌మైన స్టోరీని డాక్యుమెంట్ చేస్తున్న‌ట్లు ఫొటోగ్రాఫ‌ర్ స్టానిస్లావ్ సెనిక్ చెప్పారు. మ‌రో 10, 15 ఏళ్ల‌లో వీళ్లంద‌రికీ పిల్ల‌లు జన్మిస్తారని, తాము అనుభవించిన బాధ‌ను ఈ ఫొటోల ద్వారా వాళ్ల‌కు తెలియ‌జేస్తార‌ని వివరించారు. 

ఒక ఫొటోలో విద్యార్థులు యుద్ధ ట్యాంక్‌పై నిల్చున్నారు. త‌మ చాతీపై గ్రాడ్యుయేష‌న్ బ్యాడ్జీలు వేలాడుతుండ‌గా విష‌ణ్న వ‌ద‌నంతో చూస్తుండిపోయారు. మ‌రో ఫొటోలో కొంత‌మంది విద్యార్థినులు కూలిపోయిన భ‌వ‌నం వ‌ద్ద ఫోజులిచ్చారు. పై అంతస్తులో వారి స్నేహితులు కిందికి చూస్తూ క‌నిపించారు.

తాము ఎలాంటి ప‌రిస్థితుల్లో జీవిస్తున్నామో ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌నుకుంటున్నామ‌ని ఓల్హా బేబినెట్స్ అనే విద్యార్థినీ తెలిపింది. ఈ ప‌రిస్థితుల్లో గ్రాడ్యుయేష‌న్ డే చేసుకోవ‌డం చాలా బాధాక‌ర‌మైన‌ప్ప‌టికీ.. తమ కష్టాలను అందరికీ తెలియాల‌నే క‌లిసి ఫొటోషూట్‌లో పాల్గొన్న‌ట్లు చెప్పింది. ఈ ఫొటోల‌ను ఎగ్జిబిష‌న్‌లో ప్ర‌దర్శిస్తామ‌ని, వాటిని అమ్మి ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న సైనికుల‌కు ఇస్తామ‌ని తెలియజేసింది. 

బాంబుదాడులకు ధ్వంసమైన స్కూలు బిల్డింగ్ ముందు అందమైన బాల్ డ్రెస్ వేసుకుని నిల్చున్న ఈమె ఉక్రెయిన్ స్టూడెంట్ అన్నా ఎపిషేవా. హైస్కూల్ ఫేర్ వెల్ డే రోజున వేసుకునేందుకని ఈమె గతంలోనే ఈ డ్రెస్ తీసుకుంది. ఇంతలోనే రష్యన్లు దండయాత్ర చేసి ఇలా తన కలలన్నీ కల్లలు చేశారు. చివరకు స్కూలు శిథిలాల వద్దే ఇటీవల ఇలా ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టింది. ఉక్రెయిన్ దుస్థితిని ప్రపంచానికి చాటింది. 

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఇప్పటికే మూడు నెలలు గడిచింది. ప్రస్తుతం డాన్ బాస్ ప్రాంతంలో పుతిన్ సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి.