పంచాయతీ కార్యదర్శులపై మరింత పనిభారం

 పంచాయతీ కార్యదర్శులపై మరింత పనిభారం

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే పని భారంతో తీవ్ర ఆందోళన చెందుతున్న పంచాయతీ సెక్రటరీలకు సర్పంచ్ లు చేయాల్సిన పనులనూ అప్పగిస్తుండటంతో మరింత ప్రెజర్ కు గురవుతున్నారు. చేసిన పనులకు బిల్లులు వస్తలేవంటూ సర్పంచులు నిరసన గళాలు వినిపిస్తుండటంతో ప్రభుత్వం వారు చేయాల్సిన పనులను పంచాయతీ సెక్రటరీలకు అప్పగిస్తోంది. దీంతో ఇప్పటికే వర్క్ ప్రెజర్ తో ఉన్న సెక్రటరీలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. సర్పంచుల పనులు తాము చేస్తే.. ఏదైనా జరిగితే తమకు షోకాజ్ నోటీసులు ఇస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే రానున్నది వర్షాకాలం. ఈ సీజన్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గ్రామాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో నిధులు భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ పంచాయతీల్లో నిధుల కొరతతో అభివృద్ధి పనులపై దృష్టి సారించే అవకాశమే లేకుండా పోయింది. ఆర్నెల్ల క్రితం చేసిన పనులకే సర్పంచులకు ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. దీనిపై కోపంగా ఉన్న సర్పంచులు పల్లె ప్రగతిపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ భారం ఇప్పుడు విలేజ్ సెక్రటరీలపై పడనుంది.

సెక్రటరీలే సమిధలు 

ఈ నెల 3 నుంచి 18 వరకు పల్లె ప్రగతి కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సెక్రటరీలకు ఆదేశాలు అందాయి. ఒకవైపు సర్పంచుల గుర్రు.. మరోవైపు అధికారుల చిర్రుబుర్రు అన్న తీరుగా సాగుతున్న వ్యవహారంలో నడుమిట్ల తామే సమిధలం అవుతామని విలేజ్ సెక్రటరీలు భయంతో ఉన్నారు. ఇప్పటికే గొడ్డు చాకిరీ చేస్తున్నామంటున్న వీరు రానున్న రోజుల్లో కనీసం ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉండదంటున్నారు. పనులు చేయాలంటూ సర్పంచులను భయపెట్టడం కాదు వారిని అడుక్కోవాల్సిన అగత్యం ఏర్పడుతుందంటున్నారు.  

ట్రాక్టర్ల కిస్తీలపై ఆందోళన 

కొన్ని నెలల క్రితం గ్రామాల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. వాటికి ష్యూరిటీని విలేజ్ సెక్రటరీలే ఇవ్వాల్సి వచ్చింది. నెలకు కిస్తు రూ.40 వేల దాకా వస్తోంది. చాలా చోట్ల సెక్రటరీల సొంత అకౌంట్లను బ్యాంకులకు ఇవ్వాల్సి వచ్చింది. ఈ కిస్తులు సరిగా కట్టకుంటే తమ జీతం నుంచే కట్ అవుతుందన్న ఆందోళనతో ఉన్నారు. కొన్ని గ్రామాల్లో రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా సర్పంచులకు రావాల్సి ఉంది. గత నవంబరు, డిసెంబరు నెలల్లో చేసిన పనుల బిల్లులు ఈ మార్చిలో ఇవ్వాలి. కానీ మార్చి ముగిసినా బిల్లులు రాకపోగా, ఇయర్ ఎండ్ అన్న కారణంతో వాటిని రిజెక్ట్ చేశారు. దీంతో సర్పంచులంతా మళ్లీ ఫైల్ చేయాల్సి వచ్చింది. అప్పటి బిల్లులు ఇంతవరకూ రాకపోవడంతో సర్పంచులు చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ భారమంతా విలేజ్ సెక్రటరీలపైనే పడబోతోంది. 

ఇవన్నీ ఎలా సాధ్యం? 

ఇంతకాలం సర్పంచులు చేయించిన పనులన్నింటినీ ఇక నుంచి విలేజ్ సెక్రటరీలే చేయాల్సి ఉంటుంది. ఎక్కడ పెండింగ్ లేకుండా సర్పంచుల వెంటపడి మరీ పనులు చేయించాలి. ఇలా చేయడమంటే కత్తి మీద సాములాంటిదేనని ఉద్యోగులు భయపడుతున్నారు. సర్పంచులను బలవంతపెట్టి పనులు చేయించడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ‘‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాము కోపం అన్నట్లుగా తయారైంది మా పరిస్థితి. పనులు చేయాలని సర్పంచులను ఒత్తిడి చేయలేం. అలాగని పనులు చేయకుంటే ఎంపీడీవోలు, జిల్లా అధికారుల నుంచి చర్యలు తప్పవు. ఇలా తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఎలా పనిచేయగలం?’’ అంటూ సెక్రటరీలు అంటున్నారు. డ్రైనేజీల కన్ స్ట్రక్షన్, లీకేజీలు, స్ట్రీట్ లైట్లు, ఇంటి పన్ను వంటి భారాలతోపాటు ఇప్పుడు కొత్తగా పల్లె ప్రగతి పనులు కూడా చేయాలనడం తమను మరింత ప్రెజర్లోకి నెడుతుందని విలేజ్ సెక్రటరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.