రెస్క్యూ పోటీల్లో సింగరేణి సత్తా.. జాంబియాలో జరిగిన కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్

రెస్క్యూ పోటీల్లో సింగరేణి సత్తా.. జాంబియాలో జరిగిన  కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్

హైదరాబాద్, వెలుగు: జాంబియాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి జట్టు సత్తా చాటింది. భూగర్భ రెస్క్యూ విభాగంలో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ప్రపంచంలోని పలు దేశాల రెస్క్యూ జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో.. భారత్ నుంచి కోల్ ఇండియా సంస్థతో పాటు సింగరేణి, మరికొన్ని సంస్థలకు చెందిన జట్లు కూడా పోటీపడ్డాయి. ఏప్రిల్ 30 నుంచి మే 5 వరకు పోటీలు జరిగాయి. భూగర్భ గనుల్లో జరిగే ప్రమాదాల సమయంలో రెస్క్యూ బృందం సేవలపై నిర్వహించిన పోటీలో అగ్నిమాపక విభాగానికి 20 మార్కులు, రెస్క్యూ చర్యలకు 20 మార్కులు, సాంకేతిక సహాయానికి 10 మార్కులు కేటాయించగా సింగరేణి జట్టు అత్యద్భుత ప్రతిభ కనబర్చి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.

రెస్క్యూ ఇలా..

జాంబియా దేశంలోని ముపూలిరా పట్టణంలో ఉన్న మోపాని సెంట్రల్ ట్రైనింగ్ సెంటర్‌‌లో టెక్నీషియన్ పరీక్షను నిర్వహించారు. 700 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ గనిలో ప్రమాదానికి గురైన ఇద్దరిని వెతికి రక్షించే టాస్క్​ ఇచ్చి రెండు గంటల సమయం కేటాయించారు. ఈ టాస్క్​ను సింగరేణి జట్టు కేవలం 52 నిమిషాల్లోనే పూర్తి చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన సింగరేణి రెస్క్యూ జట్టును సంస్థ సీఎండీ జ్యోతి బుద్ద ప్రకాశ్ బుధవారం అభినందించారు.