ల్యాండ్ మైన్లు కొట్టుకొస్తున్నయ్!

ల్యాండ్ మైన్లు కొట్టుకొస్తున్నయ్!
  • కఖోవ్కా డ్యామ్ లోతట్టు ప్రాంతాల్లో టెన్షన్
  • కొన్నిచోట్ల నీటిపై తేలుతున్న మందుపాతరలు
  • యుద్ధ సమయంలో పాతిపెట్టిన రష్యా, ఉక్రెయిన్ సేనలు

ఖేర్సన్(ఉక్రెయిన్​): 
ఉక్రెయిన్​లోని కఖోవ్కా డ్యామ్ పేల్చేయడంతో దిగువ ప్రాంతంలో పట్టణాలు, గ్రామాల పరిస్థితి దారుణంగా తయారైంది. తాగేందుకు చుక్క మంచి నీరు దొరకడం లేదు. చేపలన్నీ చనిపోవడంతో వరద నీటిలో బ్యాక్టీరియా పెరిగిపోయింది. దీనికితోడు రష్యా, ఉక్రెయిన్ సేనలు పలుచోట్ల పాతిపెట్టిన యాంటీ ట్యాంక్‌‌‌‌ మైన్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఆ మైన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల జనావాసాల్లోకి చేరిన వరద నీటిపై ల్యాండ్​మైన్లు తేలుతున్నాయి. అవి ఎప్పుడు పేలుతాయో తెలియక సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. చాలా చోట్ల వరద నీళ్లు 5 మీటర్ల ఎత్తుకు చేరాయి. 150 టన్నుల ఆయిల్ దినిప్రో నదిలో కలిసిపోయింది. ఇంకా 300 టన్నుల కంటే ఎక్కువ ఆయిల్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. నైజియోడ్నిప్రోవస్కీ నేషనల్ నేచర్ పార్క్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు.  డ్యామ్​కు చుట్టుపక్క ఉన్న మైన్స్ కారణంగా నీళ్లలో కెమికల్స్ పర్సంటేజీ కూడా పెరిగిపోయిందని చెబుతున్నారు. చాలా చోట్ల వరద నీళ్లలో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల సాయంతో వాటర్‌‌ బాటిళ్లను 
అధికారులు అందిస్తున్నారు.

వ్యవసాయంపై తీవ్ర ప్రభావం

ఖేర్సన్ సిటీ మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ట్రాన్స్​ఫార్మర్లన్నీ మునిగిపోయాయి. దీంతో కరెంట్ ఉత్పత్తితో పాటు సప్లై పూర్తిగా నిలిచిపోయింది. వ్యవసాయానికి నీటి కొరత ముప్పు తప్పదని, వచ్చే ఏడాది ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని పొలాలు ఎడారులుగా మారే ప్రమాదం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖేర్సన్​ ప్రావిన్స్​లో 94%, జాపోరిజియాలో 75%, డ్నిప్రోపెట్రోవ్స్క్​లో 30% ఇరిగేషన్ సిస్టమ్స్ కొట్టుకుపోయాయని తెలిపింది. నీళ్లలో కెమికల్స్ కలవడంతో కొన్ని నెలల వరకు ఎవరూ చేపలు తినొద్దని అధికారులు సూచించారు. 20వేల ఇండ్లు, దుకాణాల్లో కరెంట్ లేదు. ఖేర్సన్​ సిటీలోని 129 ట్రాన్స్​ఫార్మర్లు నీట మునిగాయి. మైకోలైవ్​లోని రెండు సోలార్ పవర్​ ప్లాంట్స్​లోకి వరద నీళ్లు చేరాయి. 

కొట్టుకుపోయిన టీఎం57 మైన్లు

కఖోవ్కా డ్యామ్ చుట్టూ రష్యా, ఉక్రెయిన్ సేనలు పదుల సంఖ్యలో టీఎం-57 మైన్లు అమర్చాయి. డ్యామ్ పేల్చేయడంతో చాలా వరకు ల్యాండ్​ మైన్లు కొట్టుకుపోయాయి. ఉన్నవాటిని తొలగించడం రెస్క్యూ సిబ్బందికి చాలా కష్టంగా మారింది. డ్యామ్ దిగువ ఉన్న పట్టణాలు, గ్రామాల్లోకి ల్యాండ్ మైన్లు కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కడ.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆ మైన్లు అక్కడి ప్రజలతో పాటు.. రెస్క్యూ సిబ్బందికీ ముప్పుగా మారాయి.  

ప్రజలను కాపాడటం మా డ్యూటీ: జెలెన్ స్కీ

ఉక్రెయిన్‌‌ ప్రెసిడెంట్ జెలెన్‌‌ స్కీ గురువారం ముంపు ప్రాంతాలను సందర్శించారు. రిలీఫ్​ క్యాంపుల్లో ఉన్న ముంపు బాధితులతో మాట్లాడారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విటర్‌‌లో పోస్టు చేశారు. స్థానిక ఎమర్జెన్సీ వర్కర్లకు పలు సూచనలు చేశామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం తమ డ్యూటీ అని అన్నారు. రిలీఫ్​ క్యాంపుల్లో సేవలు అందిస్తున్న సహాయక బృందాలు, వాలంటీర్లకు ధన్యవాదాలు చెప్పారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలను అధికారులు ఈసందర్భంగా అధికారులు ప్రెసిడెంట్​ జెలెన్ స్కీకి వివరించారు. ఖేర్సన్​ సిటీని మళ్లీ నిర్మించుకుందామని జెలెన్​స్కీ భరోసా ఇచ్చారు.

డ్యామ్​ను ఉక్రెయినే పేల్చేసింది: రష్యా

కఖోవ్కా డ్యామ్​ను ఉక్రెయినే పేల్చేసిందని గురువారం నెదర్లాండ్స్​లోని ది హేగ్​లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజేస్)లో రష్యా ఆరోపించింది. డ్యామ్​పై భారీ ఫిరంగులతో దాడి చేసిందని రష్యా డిప్లామాట్ అలెగ్జాండర్ షుల్గిన్ కోర్టుకు వివరించారు. కీవ్​ను నయా నాజీలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కఖోవ్కా డ్యామ్​ను రష్యా పేల్చిందని ఉక్రెయిన్ అంటున్నది. ఇందులో నిజం లేదు. ఆ పని చేసింది ఉక్రెయినే. జూన్ 6న రాత్రి ఫిరంగులతో అటాక్ చేసింది. ఉద్దేశపూర్వకంగానే కఖోవ్కా డ్యామ్​లో సామర్థ్యం కంటే ఎక్కువ నీటిని జమ చేసింది. ప్రమాదకర పరిస్థితికి తీసుకొచ్చింది” అని షుల్గిన్ కోర్టుకు వివరించారు.