రూ. 1500 టికెట్ @ రూ.6వేలు.. ముగ్గురి అరెస్ట్

రూ. 1500 టికెట్ @ రూ.6వేలు..  ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా కాసేపట్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు సంబంధించి ఇప్ప్పటికే టికెట్ల విక్రయాలు పూర్తవగా..ప్యారడైజ్ దగ్గర గల జింఖానా గ్రౌండ్ పరిసరాల్లో మ్యాచ్ టికెట్ల దందా కొనసాగుతోంది. భారత్ ఆసీస్ మ్యాచ్ టికెట్లను కొందరు బ్లాక్ లో విక్రయిస్తున్నారు. రూ. 1500 టికెట్లను రూ. 6 వేలకు అమ్ముతున్న గుగులోత్ వెంకటేష్, ఇస్లవత్ దయాకర్, గుగులోత్ అరుణ్ అనే ముగ్గురిని.. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 టికెట్లు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్ఓటీ పోలీసులు ఆ ముగ్గురిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. 

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దాదాపు మూడేళ్ల తర్వాత క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దీంతో ఈ మ్యాచ్ను ఎలాగైనా చూడాలని ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. టికెట్లను బ్లాక్ లో అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించారు. అటు టికెట్ల అమ్మకం వ్యవహారం ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. అయితే టికెట్లే లేవని HCA ప్రకటించగా..బ్లాక్లో టికెట్లు అమ్మేవారికి అవి ఎలా వచ్చాయని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.