
- 4,375 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్లు
- అన్‌క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఇన్‌సర్వీస్ వెయిటేజీ
- కోర్టుకెక్కిన నిరుద్యోగులు
- కౌంటర్ వేయని టీఎస్‌పీఎస్సీ
- నోటిఫికేషన్లు రద్దు చేస్తారని కేండిడేట్ల ఆందోళన
హైదరాబాద్, వెలుగు: సర్కారీ దవాఖాన్లలో పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. వేలాది ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్లను సైతం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ‘కాంట్రాక్ట్’ రిక్రూట్‌మెంట్లకు ప్రభుత్వం తెరలేపుతుండడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేస్తుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నోటిఫికేషన్లు ఇచ్చి రెండేండ్లు
సర్కారు దవాఖాన్లలోని స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం, రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్ తదితర 4,375 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2017 నవంబర్ నుంచి 2018 జనవరి వరకూ నోటిఫికేషన్లు ఇచ్చింది. సర్కారు దవాఖాన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి రాత పరీక్షలో 30% వెయిటేజీ ఇచ్చింది. దీనిపై నిరుద్యోగులు కోర్టుకెక్కారు. ఈ కేసు కోర్టులో ఉండగానే, 2018 మార్చిలో టీఎస్పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. ఈ జనవరిలో ఫార్మసిస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో కనీస అర్హత సాధించని వారికి.. వెయిటేజీ మార్కులు కలిపి చోటు కల్పించింది. రూల్స్‌కు వ్యతిరేకంగా లిస్ట్ ఉందంటూ నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. పొరపాటును అంగీకరించిన అధికారులు, మళ్లీ మెరిట్ లిస్ట్ ప్రకటించారు. రెండో లిస్ట్‌లోనూ కనీస అర్హత మార్కులు రాని కాంట్రాక్ట్ ఉద్యోగులకు చోటిచ్చారు. దీనిపై కోర్టులో నిరుద్యోగులు మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఇంతవరకూ టీఎస్‌పీఎస్సీ కౌంటర్ దాఖలు చేయలేదు. వంద మార్కుల పరీక్షలో 30 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం.. కనీస అర్హత మార్కులు సంపాదించనోళ్లకూ వెయిటేజీ మార్కులు కలపడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
‘ఇన్‌సర్వీస్’ పేరిట అక్రమాలు?
ఇన్‌సర్వీస్ వెయిటేజ్ మార్కులు కలిపే విషయంలో భారీగా డబ్బులు చేతులు మారాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అనర్హులకు మార్కులు కలపడమేకాక, సర్వీస్ సర్టిఫికెట్ల జారీలోనూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని అంటున్నారు. మరోవైపు, సర్కారు దవాఖాన్లలో ఖాళీల సంఖ్య పెరుగుతున్నందున, కాంట్రాక్ట్ బేసిస్‌పై భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు కేసులను బూచిగా చూపి నోటిఫికేషన్లను రద్దు చేస్తుందన్న ఆందోళనతో నిరుద్యోగులు ఇటీవల ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. తమ చెప్పులతో తామే కొట్టుకుని నిరసన తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా, కేసులు వాపస్ తీసుకునే వరకూ నోటిఫికేషన్లు ముందుకు సాగవని కామెంట్ చేశారు.
నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల వివరాలు
పోస్టు ఉద్యోగాలు
స్టాఫ్ నర్సులు 3,311
ల్యాబ్ టెక్నీషియన్ 325
ఫార్మసిస్ట్ 369
ఏఎన్‌ఎం 150
రేడియోగ్రాఫర్ 115
ఫిజియోథెరపిస్ట్ 105