తెలంగాణలో స్కూల్స్ టైమింగ్స్ మారాయి.. ఎప్పటి నుంచి అంటే..?

తెలంగాణలో స్కూల్స్ టైమింగ్స్ మారాయి.. ఎప్పటి నుంచి అంటే..?

తెలంగాణలో పాఠశాలల పని వేళల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యేలా మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ సోమవారం (జులై 24న) ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్రాథమిక పాఠశాలలు, ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలలు పని చేయనున్నాయి. జంట నగరాల (హైదరాబాద్‌- సికింద్రాబాద్) పరిధిలో మినహా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల వేళల్లో మార్పులు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ పంపించింది. వారి పరిధిలోని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల సమయాల్లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో కొన్ని మార్పులు చేయాలని కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో మాత్రం కొంచెం ముందుగా మొదలవుతాయి.