సర్కార్​ కంట్రోల్​లోకి డాక్యుమెంట్ రైటర్లు!

సర్కార్​ కంట్రోల్​లోకి డాక్యుమెంట్ రైటర్లు!
  •     స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ శాఖలో త్వరలో మార్పులు
  •     డాక్యుమెంట్​ రైటర్స్​కు లైసెన్సులు
  •     డాక్యుమెంటేషన్‌‌‌‌కు ఫీజుల నిర్ధారణ
  •     వినీతికి పాల్పడితే లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు

హైదరాబాద్, వెలుగు: స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్స్​ శాఖలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టడానికి సరిగ్గా ఒక రోజు ముందు రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ శాఖలాగే స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ పైసలివ్వనిదే ఫైల్​ కదలని పరిస్థితి నెలకొందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆ శాఖలో మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. రిజిస్ట్రేషన్​ ప్రక్రియలో డాక్యుమెంట్​ రైటర్లదే కీలక పాత్ర. సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులకు సమీపంలో ఎలాంటి చట్టబద్ధత లేకుండా చిన్నచిన్న గదుల్లో ఈ డాక్యుమెంట్​ రైటర్లు కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. త్వరలో తహసీల్దార్ ఆఫీసుల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్​ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండడంతో అక్కడ కూడా డాక్యుమెంట్​ రైటర్ల అవసరం ఏర్పడనుంది. డాక్యుమెంట్​ రైటర్లపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని భావిస్తున్న ప్రభుత్వం.. వారిని కంట్రోల్​లో పెట్టుకునేందుకు పరీక్షలు నిర్వహించి లైసెన్సులు జారీ చేయాలని యోచిస్తున్నది.  అర్హులైనవారికి లైసెన్స్​ ఇవ్వడం ద్వారా.. వారు  ఏమైనా అక్రమాలకు పాల్పడితే బాధ్యులను చేసి లైసెన్స్​ రద్దు చేయడంతోపాటు ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.  డాక్యుమెంటేషన్​ చార్జీలను కూడా ప్రభుత్వమే నిర్ధారించనున్నట్లు సమాచారం.

సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులు.. రూరల్​లో తగ్గింపు, అర్బన్​లో పెంపు

రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీసులు ఉండగా.. వీటిలో హెచ్ఎండీఏ పరిధిలోనే 42 ఆఫీసులు ఉన్నాయి. మిగతా 99 ఆఫీసులు జిల్లాకు ఒకటి, రెండు చొప్పున ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 తహసీల్దార్​ ఆఫీసుల్లో పైలట్ ప్రాజెక్టుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక మీదట అగ్రికల్చర్​ ల్యాండ్ రిజిస్ట్రేషన్లను అన్ని తహసీల్దార్​ ఆఫీసుల్లో ప్రారంభం కానుండడంతో రూరల్ ఏరియాలోని సబ్​ రిజిస్ట్రార్ ఆఫీసులకు ప్రజల తాకిడి తగ్గే అవకాశముంది. ఇప్పటికే ఇలాంటి ఆఫీసులపై అంచనాకు వచ్చిన సీనియర్​ ఆఫీసర్లు రూరల్ ఏరియాలోని సుమారు 20 ఆఫీసులను కుదించాలని భావిస్తున్నట్లు తెలిసింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటైనప్పటికీ అక్కడి భూముల రిజిస్ట్రేషన్​ కు ములుగుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ జిల్లా కేంద్రంలో రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. అలాగే హైదరాబాద్ మహానగర శివారులోని మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రియల్​ ఎస్టేట్​​ వ్యాపారం జోరుగా నడుస్తుండడం.. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా అవుతుండడంతో ఈ జిల్లాల్లో 20 వరకు ఆఫీసులను కొత్తగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.