లిక్కర్ సేల్స్ తో 40 వేల కోట్లు 

లిక్కర్ సేల్స్ తో 40 వేల కోట్లు 
  • మూడేండ్లలో ఆదాయం డబుల్... నెలకు రూ. 3 వేల కోట్ల ఇన్ కం 
  • లిక్కర్ రేట్లు, సేల్స్ పెంచి.. భూముల వ్యాల్యూ, చార్జీలు సవరించి పైసా వసూల్ 

హైదరాబాద్, వెలుగు: ఒకవైపు లిక్కర్ కిక్కు.. మరోవైపు రిజిస్ట్రేషన్ల జోరుతో రాష్ట్ర సర్కారుకు మస్త్ ఆమ్దానీ వస్తున్నది. మందు రేట్లను, సేల్స్ ను క్రమంగా పెంచుతుండటంతో లిక్కర్ ఇన్ కం కూడా అంతే పెరుగుతున్నది. అట్లనే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలను రెండు సార్లు సవరించడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ద్వారా కూడా ఆదాయం భారీగానే పెరిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం మూడేండ్లలో డబుల్ కాగా, లిక్కర్ రాబడి కూడా దాదాపు రెట్టింపు స్థాయిలో పెరిగింది. లిక్కర్, రిజిస్ట్రేషన్ల ద్వారానే నెలకు యావరేజ్ గా రూ.3 వేల కోట్ల రాబడి వస్తోంది. రిజిస్ర్టేషన్ల ఆదాయం 2018–19లో రూ.6,612 కోట్లు వచ్చింది. అదే ఈ ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే రూ.6,100 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ రాబడిలోనూ మస్త్ ఆమ్దానీ పెరిగింది. 2018-–19 ఏడాదిలో లిక్కర్ రాబడి వ్యాట్ తో కలిపి రూ.20,447 కోట్లు వస్తే.. ఇప్పుడు 5 నెలల్లోనే రూ.15,350 కోట్ల రాబడి వచ్చింది. 

లిక్కర్ సేల్స్ తో 40 వేల కోట్లు 

ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర సర్కార్ రిటైల్ మద్యం ధరలు పెంచింది. మద్యం రకాలను బట్టి రూ.20 నుంచి రూ.160 వరకు పెంచారు. బ్రాండ్లతో నిమిత్తం లేకుండా, క్వాంటిటీతో సంబంధం లేకుండా బీర్లపై రూ.10 చొప్పున ధర పెరిగింది. దీంతో ఆదాయం రెట్టింపునకు చేరుకున్నది. దీనికి తోడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సేల్స్ కూడా టార్గెట్లు పెట్టి మరీ చేయిస్తోంది. దీంతో ఒక్క నెలలో యావరేజ్ గా అన్ని రకాలుగా కలిపి ఎక్సైజ్ ద్వారా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయం దాదాపు రూ.2 వేల కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క లిక్కర్ తోనే రూ.40 వేల కోట్ల దాకా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.  

జోరుగా రిజిస్ట్రేషన్ల ఆమ్దానీ 

లిక్కర్ తర్వాత రాష్ట్రానికి పన్నుల రూపంలో రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ నుంచి రాబడి ఎక్కువగా వస్తున్నది. గత నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్లతో వచ్చిన ఆదాయం రూ.1,095 కోట్లు. నాలుగు నెలల్లో మొత్తం రూ.4,910 కోట్లను సర్కారు వసూలు చేసింది. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. అందులో భాగంగానే రిజిస్ర్టేషన్ల ఆదాయం కూడా అంతకంతకూ పెరుగుతున్నది. ఇప్పటికే రెండు సార్లు ల్యాండ్ వ్యాల్యూ సవరించి, రిజిస్ర్టేషన్ చార్జీలు పెంచారు. దీంతో రూ.500–600 కోట్లలోపే ఉండే స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల ఆదాయం ఇప్పుడు వెయ్యి కోట్లు దాటుతున్నది. 2018–19లో రూ.6,612 కోట్లు ఉన్న ఆదాయం 2021–22లో రూ.12,364 కోట్లకు చేరింది. 

ల్యాండ్ సేల్స్ తోనూ వేల కోట్లు 

భూముల అమ్మకంతోనూ రాష్ట్ర సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు గట్టిగానే ఆదాయం పొందింది. ఏప్రిల్ నుంచి జులై వరకు రూ.7,432 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వచ్చినట్లు లెక్కల్లో చూపారు. గత నెలలో రూ.558 కోట్లు వచ్చాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 90 శాతానికి పైగా ల్యాండ్ సేల్స్ తో సమకూర్చుకున్నవే.