సాగర్​ ఎడమ కాల్వను ఎట్టికి వదిలేసిన్రు!

సాగర్​ ఎడమ కాల్వను ఎట్టికి వదిలేసిన్రు!

ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే సాగర్​ ఎడమ కాల్వను రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది.  కాల్వ లైనింగ్​ దెబ్బతిని, తరుచూ గండ్లు పడ్తున్నా కన్నెత్తి చూడడం లేదు. గండ్ల కారణంగా పంటలు కొట్టుకుపోయి నష్టపోతున్నామని రైతులు, ఎక్కడ తెగుతుందనే భయంతో కెపాసిటీ మేరకు వాటర్​ రిలీజ్​ చేయలేపోతున్నామని ప్రాజెక్టు ఆఫీసర్లు చాలాకాలంగా మొత్తుకుంటున్నారు. కెనాల్​కు శాశ్వత మరమ్మతుల కోసం ఫండ్స్​ ఇవ్వాలని నాలుగేండ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. ఇటీవల నల్గొండ జిల్లాలో అధ్వానంగా మారిన 11 కిలోమీటర్ల కెనాల్​కు టెంపరరీ రిపేర్ల కోసం రూ.20 కోట్లు అడిగితే కేవలం రూ.13 కోట్లు ఇచ్చారు. మరి మిగిలిన కెనాల్​ రిపేర్లకు ఫండ్స్​ ఎప్పుడు వస్తాయో, రిపేర్లు ఎప్పుడు చేస్తారో తెలియక రైతులు తలపట్టుకుంటున్నారు. 

మిర్యాలగూడ, వెలుగు: నాగార్జున సాగర్​ ఎడమ కాల్వ నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గోదావరి జిల్లాల్లో 298.25 కిలోమీటర్ల మేర ఉండగా దీని కింద మొత్తం 9.2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండతో పాటు ఖమ్మం జిల్లాలో 6,43,845 ఎకరాలు సాగర్​ఎడమ కాల్వ కింద సాగవుతున్నాయి. 2008లో ప్రపంచ బ్యాంకు నిధులు రూ. 4,444 కోట్లతో కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ పనులు చేపట్టారు. 2018 వరకు పనులు కొనసాగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 133 కిలోమీటర్ల మేర కాల్వ రిపేర్లను రూ. రూ. 1,026 కోట్లతో ఐదు ప్యాకేజీల్లో చేపట్టారు. నిధులు సరిపోలేదంటూ కాంట్రాక్ట్​ సంస్థ పలు చోట్ల సీసీ లైనింగ్, ఇతర పనులు అసంపూర్తిగా వదిలేసింది. సీసీ లైనింగ్​లేనిచోట, సీసీ లైనింగ్​దెబ్బతిన్న ప్రాంతంలో నీటి ప్రవాహ వేగానికి కాల్వ కట్ట బలహీనమై కోతకు గురవుతూ క్రమంగా గండ్లు పడ్తున్నాయ్. ఎడమ కాల్వపై నిర్మించిన యూటీలు(అండర్​ టన్నెల్), ఓటీ(ఆఫ్​కట్, తూములు) వద్ద చిన్నగా మొదలయ్యే లీకేజీలతో పాటు ఎండ్రకాయలతో బొరియలు ఏర్పడటం, కాల్వ అడుగు భాగంలో బెడ్​ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల గండ్లు పడుతున్నాయని  ఆఫీసర్లు అంచనాకు వచ్చారు. 

రైతన్నలకు కడ‘గండ్లు’

గత రెండు నెలల్లో సాగర్​ఎడమ కాల్వకు రెండు భారీ గండ్లు పడి వందల ఎకరాల్లో వరి పంట నీట మునగడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలోని ముప్పారం 32వ కిలోమీటర్​వద్ద సెప్టెంబర్​7న కాల్వకు భారీ గండి పడి వందల ఎకరాల వరి పంట నీట మునిగింది. గండి పూడ్చేందుకు పది రోజులు పట్టింది. దీంతో కాల్వలపైనే ఆధారపడిన రైతులు పొట్ట దశకు చేరిన వరి పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం  తుమ్మలపల్లి – బయ్యన్నగూడెం గ్రామాల మధ్య గండి పడి వరి పంట నీట మునిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని హాలియా, వేములపల్లి, మిర్యాలగూడ, నేరేడుచర్ల, ఇతర ప్రాంతాల్లో సైతం ఎడమ కాల్వ కట్ట శిథిలమై, కోతకు గురై ప్రమాదకరంగా మారింది. నల్గొండ జిల్లాలో ఎడమ కాల్వకు 11 కిలోమీటర్ల మేర సీసీ లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం 2018–19లో అధికారులు సుమారు రూ. 20 కోట్లు కోరుతూ ప్రతిపాదనలు పంపారు. ఇన్నేండ్లుగా ఒక్క పైసా ఇవ్వని సర్కారు ఇటీవల రూ. 13 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో నిడమనూరు మండలం బొక్క ముంతల పహాడ్, పెద్ద దేవులపల్లి వద్ద కిలో మీటర్ మేర సీసీ లైనింగ్  పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మునుగోడు బై ఎలక్షన్స్​నేపథ్యంలోనే ఫండ్స్​రిలీజ్​చేశారని, ముందే పనులు చేపట్టి ఉంటే పంటలు నీట మునిగేవి కావని రైతులు అంటున్నారు. ఇప్పుడు సైతం అరకొరగా నిధులిచ్చారని, మళ్లీ సగం పనులు వదిలేస్తే ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. 

కాల్వ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలె

సాగర్​ ఎడమ కాల్వకు గండ్లు పడుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఎడమ కాల్వపై మిగిలి ఉన్న సీసీ లైనింగ్, ఇతర పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఇప్పటికే నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వద్ద గండి పడి రైతులు నష్టపోయారు. సరైన విధంగా నిధులు కేటాయించి కాల్వను బలోపేతం చేయాలి. 
– ముదిరెడ్డి నర్సిరెడ్డి, కిసాన్​ కాంగ్రెస్​ రాష్ట్ర నాయకులు, మిర్యాలగూడ

ఇన్​టైంలో పనులు పూర్తి చేస్తం

నాగార్జున సాగర్​ఎడమ ప్రధాన కాల్వ పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తున్నం. కోతకు గురవుతున్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలను పంపించాం. ఆయా పనులకు ప్రభుత్వం ఫండ్స్​శాంక్షన్​ చేసింది. పనులు అగ్రిమెంట్​దశలో ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనులు ఇన్​టైంలో కంప్లీట్​చేస్తాం. 
– సంపత్, డీఈ, మిర్యాలగూడ ఇరిగేషన్​ డివిజన్​